317 జీవోపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

by Disha Web Desk 2 |
317 జీవోపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ట్రెజరీ నుంచి జీతం అందుకుంటున్న సిబ్బంది ఎదుర్కొంటున్న జీవో 317 సమస్యలపై స్టడీ చేసి పరిష్కార మార్గాలను సూచించేలా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటవుతున్నది. వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలు మరో ఇద్దరు మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉండనున్నారు. వీరు జీవో 317తో తలెత్తిన సమస్యలు, ఉద్యోగులు-ఉపాధ్యాయుల అభిప్రాయాలు, గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఇకపైన ఆ సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు.. ఇలాంటి అనేక అంశాలను స్టడీ చేసి తగిన సిఫారసులతో పాటు నివేదిక సమర్పించాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన జీవో (నెం. 292)లో పేర్కొన్నారు.

ఈ కమిటీకి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో 317 ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారితోనూ, వారు పనిచేస్తున్న హెచ్ఓడీలతోనూ, సంబంధిత డిపార్టుమెంట్ల సెక్రటరీలతోనూ చర్చించనున్నది. కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించే సమావేశాలకు ఆయా డిపార్టుమెంట్ల సెక్రటరీలు, హెచ్ఓడీలు హాజరై సహకారం అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీ తాజా జీవోలో స్పష్టం చేశారు. దాదాపు రెండున్నరేండ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకుని వాటికి పరిష్కారం చూపడం లక్ష్యంగా పనిచేయనున్నది. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టనున్నది.

గత ప్రభుత్వం పది జిల్లాలను 31 జిల్లాలుగా మార్చినప్పుడు (అప్పటికి 33 జిల్లాలు లేవు) 2021 డిసెంబరు 6న జీవో నెం. 317ను జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను కొత్త జిల్లాలవారీగా శాశ్వత ప్రాతిపదికన పోస్టింగులు ఇచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వుల (2018 నాటి) స్ఫూర్తికి అనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించింది. ఉమ్మడి జిల్లాల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయులను కొత్త జిల్లాల్లోకి పంపేలా ఈ జీవోను జారీచేసింది. కానీ మార్గదర్శకాల్లోని లోపాలతో పాటు అప్పటి అధికార పార్టీ నేతలకు దగ్గరగా ఉన్న ఉద్యోగులు వారికి అనువైన స్థానాల్లో పోస్టింగులు ఇప్పించుకున్నారని, అర్హతలు కలిగిన ఉద్యోగుల్లో చాలా మందికి న్యాయం జరగలేదని అప్పటి సచివాలయాన్ని ముట్టడించారు. అప్పటి నుంచి ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది.

జీవో 317లో ప్రభుత్వం ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించేటప్పుడు (కేడర్ అలాట్‌మెంట్) స్థానికతను, కుటుంబ నేపథ్యాన్ని, భార్యాభర్తల ఉద్యోగాలను పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు ఉద్యోగుల నుంచే వినిపించాయి. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో నాన్-ట్రైబల్ ఉద్యోగులను పర్మినెంట్‌గా పోస్టింగ్ చేయడం ద్వారా మొత్తం శాంక్షన్డ్ పోస్టుల సంఖ్యలో తేడాలు వచ్చి భవిష్యత్తులో ఖాళీ పోస్టుల భర్తీ సమయంలో స్థానికంగా ఉన్న గిరిజనులు, ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని తుడుందెబ్బ ఆందోలన వ్యక్తం చేసి అప్పట్లో ఒక రోజు బంద్‌కు పిలుపునిచ్చింది. భార్యాభర్తలు, కుటుంబ సభ్యులంతా ఒక జిల్లాలో ఉంటే ఈ జీవో కారణంగా దూరంగా ఉన్న మరో జిల్లాకు బదిలీ అవ్వాల్సి వస్తున్నదని, ఇది పర్మినెంట్ పోస్టింగ్ కావడంతో భవిష్యత్తు మొత్తం సొంత ఊరికి (జిల్లాకు), బంధువులకు సంబంధం లేని కొత్త జిల్లాల్లో గడపాల్సి ఉంటుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు.

గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీఆర్ఎస్‌కు దూరం కావడానికి ఈ జీవో కారణమైందని, ఓటమికి ఇదీ ఒక ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలే వాపోయారు. ఈ కారణంగానే వారంతా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం కాంగ్రెస్ పార్టీ “జీవో 317ను సమీక్షించి బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తాం.. ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీలను ఏటా వేసవి కాలంలో చేపడతాం..” అని హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించడంతో పాటు భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్నవారిని, పదోన్నతులు లేకుండా పోస్టింగ్‌పై గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నష్టపోయిన ఉద్యోగుల అభిప్రాయాలను కూడా తెలుసుకోనున్నది.

లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడంతో ఆ పార్టీ పట్ల ఈ సెక్షన్ ఓటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశమున్నది. బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత యధాతథంగా కంటిన్యూ కావడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రస్తుత యాక్టివిటీతో అసెంబ్లీ ఎన్నికల సమయంతో పోలిస్తే ఈసారి లోక్‌సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్‌కు మరింత అడ్వాంటేజ్‌గా మారనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశమున్నది.

Next Story

Most Viewed