బిగ్ న్యూస్: హార్ట్ స్ట్రోక్స్ ​నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ​కీలక నిర్ణయం!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: హార్ట్ స్ట్రోక్స్ ​నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ​కీలక నిర్ణయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సర్కార్ ​ఆసుపత్రులలో ‘గుండె’ షాక్​ మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యవసర సమయంలో హార్ట్ ​రెస్పాన్స్ ​కోసం వీటిని వినియోగిస్తారు. దాదాపు రూ.18 కోట్లతో 1200 ఏఈడీ(ఆటోమేటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డెఫిబ్రిలేటర్స్‌) పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేయనున్నది. వీటిని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖాన్లు, క్షేత్రస్థాయిలోని కమ్యూనిటీ హెల్త్​కేర్​ సెంటర్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్లకు మెడికల్ ​కాలేజీల్లోని కార్డియాలజీ విభాగాలకు సమన్వయ యూనిట్లు ఉంటాయి.

ఏఈడీ మానిటరింగ్ యూనిట్​లలో పనిచేసే స్టాఫ్​కు ప్రత్యేక శిక్షణ ఇవ్వనునారు. మాస్టర్​ ట్రైనర్​ల ఆధ్వర్యంలో జిల్లాల్లోని స్టాఫ్​కు శిక్షణ ఉంటుందని వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అంతేగాక ఇక ముందు అపార్ట్మెంట్, గేటెడ్​ కమ్యూనిటీ, మాల్స్, బస్టాండ్లకు పర్మిషన్ ఇవ్వాలంటే ఏఈడీ విధిగా పెట్టాలనే కొత్త రూల్​ను కూడా సర్కార్ ​తీసుకువచ్చేందుకు ఆలోచిస్తున్నది. ఆయా శాఖలకు వైద్యారోగ్య శాఖ లేఖలు రాయనున్నది.

ఏ సమయంలో వినియోగిస్తారు..?

అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైక్లాజికల్‌ షాక్స్‌కి గురవుతాడు. మరి కొన్ని సందర్భాలలో కార్డియాక్ ​అరెస్ట్ (సడన్​గా గుండె ఆగిపోవడం) వంటివి జరుగుతాయి. ఇలాంటి సమయంలో హృదయ స్పందనలో తేడా వస్తుంది. గుండె లయ తప్పి ఆగిపోతుంది. ఈ పరిస్థితుల్లో మనిషి స్పందించడు, శ్వాస ఆగిపోతుంది. దీంతో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడం వల్ల గుండె, ఊపిరితిత్తులు తిరిగి పని చేసే అవకాశం ఉంటుంది. దీన్నే సీపీఆర్‌ అంటారు.

అయితే ఇంత చేసినా.. కొన్ని సార్లు గుండె స్పందించదు. ఇలాంటి పరిస్థితుల్లో సదరు బాధితుడికి ఆటోమేటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డెఫిబ్రిలేటర్స్‌( ఏఈడీ) అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇస్తారు. ఇలా బాధితుడి స్పర్శ ఆధారంగా ఆ పరికరంతో కరెంట్​షాక్ ​ఇవ్వడం వలన తిరిగి గుండె పనిచేసే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఈ మిషన్ల వలన ఉపయోగం జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం కేవలం మెడికల్​ కాలేజీల అనుబంధపు ఆసుపత్రులలోనే ఏఈడీ మిషన్లు అందుబాటులోకి ఉండగా, ఇక నుంచి క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్​సెంటర్లలోనూ సమకూర్చాలని సర్కార్​ ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నది.

ఎందుకీ నిర్ణయం?

మారిన జీవన శైలి, ఆహారపు, చెడు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలు గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి. వీటి వలనే కార్డియాక్​ అరెస్టులు అవుతున్నట్లు పలు హెల్త్ ​సర్వేలు చెబుతున్నాయి. కరోనా తర్వాత కార్డియాక్ అరెస్టులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలూ స్పష్టం చేస్తున్నాయి. గతంలో యాభై ఏళ్లకుపై బడిన వారికి హార్ట్​ స్ట్రోక్​లు వస్తుండగా, ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండానే సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌‌లు వస్తున్నాయి.

దీన్ని పరిగణలోకి తీసుకున్న వైద్యశాఖ.. ఫ్రంట్​లైన్​ వర్కర్లకు సీపీఆర్​( కార్డియో పల్మనరీ రిససిటేషన్‌) ట్రైనింగ్​ ఇవ్వడమే కాకుండా, ఏఈడీ మిషన్లు కూడా అందుబాటులో ఉంటే ఎక్కువ మందికి మేలు జరుగుతుందని గుర్తించింది. గ్రామ స్థాయిలోనే ఇవి అందుబాటులో ఉండటంతో ప్రాణాపాయ పరిస్థితులు ఉండవని ప్రభుత్వం ఆలోచన. దీంతోనే క్షేత్రస్థాయిలోని మెడికల్ ​ఫెసిలిటీల్లోనూ గుండె కు షాక్​నిచ్చే మిషన్లను అందుబాటులో ఉంచనున్నారు.

Next Story