కష్టకాలంలో పార్టీని వదిలి.. స్వార్థానికి పోతున్నారు: కేసీఆర్

by Disha Web Desk 2 |
కష్టకాలంలో పార్టీని వదిలి.. స్వార్థానికి పోతున్నారు: కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు అనాలోచితమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో పడిపోయిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడమే కాకుండా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు అభివృద్ధి పనులను ఆటంకపరచడమే లక్ష్యంగా అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటున్నదని అన్నారు. బీఆర్ఎస్ రూపొందించిన ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్‌కు పుష్కలంగా సాగునీటిని తరలించవచ్చని, దానికి బదులు కొడంగల్‌కు లిఫ్టును మార్చడం సరియైన నిర్ణయం కాదన్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెప్తారని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం సందర్భంగా కేసీఆర్ పై కామెంట్లు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజురోజుకూ దిగజారి పోతున్నదని, ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు కూడా కాకముందే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు అలవిగాని హామీలిచ్చి, గ్యారంటీల పేరుతో ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి ఇప్పుడు మాట మార్చిందన్నారు. సమయంతో సహా ప్రకటించిన, ప్రమాణపూర్వకంగా ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతూ ఉంటే సమాధానమివ్వడం చేతకాక నాలిక మడతేసి అబద్దాలకు బెదిరింపులకు దిగి తప్పించుకుంటున్నదని కాంగ్రెస్‌పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేసే బీఆర్ఎస్‌ను దూరం చేసుకుని కాంగ్రెస్ మాటలకు మోసపోయామన్న సంగతిని ప్రజలు గ్రహిస్తున్నారని, త్వరలోనే వాస్తవాలను తెలుసుకుని తిరిగి ఆదరిస్తారని, చరిత్రలో చాలా ఘటనలు ఉన్నాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు సాగునీరు కరెంటు లాంటి కనీస అవసరాలను తీర్చలేకపోవడంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, కొత్తగా ఇచ్చే తెలివి లేకున్నా గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలనూ కొనసాగించలేక పాలనలోని డొల్ల తనాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ బయటేసుకుంటున్నదనే భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. గెలుపు, ఓటములు సహజమని, ప్రజాక్షేత్రంలో ఉంటూ వారితో మమేకమై సమస్యల పరిష్కారానికి పోరాడాలని నాయకులకు స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాదరణ పొందాలని పిలుపునిచ్చారు. పాలమూరు ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు.

చేసిన మేలును మరిచి కేవలం తమ స్వార్థంతో పార్టీని వీడుతున్నవారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టంచేశారు. “ఎప్పడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురు..” అనే సుమతీ శతకాన్ని ఉదహరించారు. కష్టకాలంలో ప్రజలతో నిలిచినవారే నిజమైన ప్రజా నాయకులన్నారు. పోయేవాళ్ల గురించి ఆలోచించకుండా కలిసికట్టుగా ప్రజా సమస్యలమీద పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. “కష్టకాలంలో స్వార్థానికి వెళ్ళిపోయిన అవకాశవాదులకు తిరిగి భవిష్యత్తులో సందివ్వకూడదు” అంటూ సమావేశంలో పాల్గొన్న నేతలు సూచించారు.

దీర్ఘకాలిక లక్ష్యంతోనే పొత్తు : కేసీఆర్

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉంటుందని పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చిన కేసీఆర్.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీతో చేసిన చర్చలను వివరించారు. సైద్ధాంతికతో, భావసారూప్యతతో పనిచేస్తున్న బీఎస్పీతో పొత్తును ప్రజలు హర్షిస్తారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శక్తిని కూడదీసుకోవాలని, కలిసి వచ్చే శక్తులను కలుపుకుపోవాలన్నారు. ప్రజా ప్రయోజనాలను కాపాడే దీర్ఘకాలిక లక్ష్యంతో ఈ పొత్తు కుదుర్చుకున్నట్లు వివరించారు. దళిత బహుజన శక్తులతో కలిసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మరింత చేరువ అవుతామన్నారు. పొత్తు విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు.

Next Story

Most Viewed