ప్రధాని పదవి రేసులో కేసీ‌ఆర్.. ఆ కూటమికి చైర్‌పర్సన్ కావడానికి పక్కా ప్లాన్!

by Disha Web Desk 2 |
ప్రధాని పదవి రేసులో కేసీ‌ఆర్.. ఆ కూటమికి చైర్‌పర్సన్ కావడానికి పక్కా ప్లాన్!
X

ప్రధాని పదవి రేసులో కేసీఆర్ ఉన్నారా?.. బీజేపీ వ్యతిరేక పోరాటానికి చాంపియన్‌గా నిలవాలనుకుంటున్నారా?.. యాంటీ బీజేపీ పార్టీలన్నింటినీ ఒక్క తాటిమీదకు తేవాలని భావిస్తున్నారా?.. అలాంటి కూటమికి అన్నీ తానై వ్యవహరించాలనుకుంటున్నారా?.. చివరకు ప్రధాని పదవినీ కోరుకుంటున్నారా?.. ఇందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధమవుతున్నారా?.. ఇలాంటి ప్రశ్నలకు బీఆర్ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. ఆయన రాజకీయ కదలికలను పసిగట్టిన సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. యాంటీ బీజేపీ ఫ్రంట్‌ను లీడ్ చేసే బాధ్యతలను కోరుకుంటున్నట్టు కేసీఆర్ తన సన్నిహితులతో షేర్ చేసుకున్న అంశాన్ని గుర్తుచేశారు.

“అన్ని ప్రతిపక్షాల కూటమికి నన్ను చైర్‌పర్సన్‌ను చేయండి. 2024 పార్లమెంటు ఎన్నికల క్యాంపెయిన్ మొత్తం ఖర్చును నేను చూసుకోడానికి సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్ తన సన్నిహితులతో జరిపిన ఒక ప్రైవేటు కాన్వర్జేషన్‌లో ఈ విషయాన్ని చెప్పారు. నిజంగా ప్రతిపక్షాలు ఆయన ప్రతిపాదనను అంగీకరిస్తాయా? అందరినీ కాదని ఆయనకు ఆ బాధ్యతలు ఇస్తారా? బహుశా సాధ్యం కాకపోవచ్చు”.. ఇదీ సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ తన సొంత యూ-ట్యూబ్ చానెల్‌లో రెండు రోజుల క్రితం ‘మోడీ వర్సెస్ ఆల్’ అనే అంశంపై విశ్లేషణ సందర్భంగా చేసిన కామెంట్. = హాట్ టాపిక్‌గా రాజ్‌దీప్ సర్దేశాయ్ కామెంట్స్

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఇంతకాలం పరిమితమైన పార్టీని ఇప్పుడు జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో దాని పేరును బీఆర్ఎస్‌గా మార్చారు. ఈ సందర్భంలోనే ‘దేశ్ కా నేతా కేసీఆర్’ అనే స్లోగన్‌లు ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఈ దేశానికి కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేత అవసరం ఉన్నదనే ఆ పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఒక ఫ్రంట్ ఏర్పాటై గెలిస్తే దానికి కన్వీనర్ లేదా చైర్‌పర్సన్‌గా ఉన్న వారే ప్రధాని కావడం ఓ ఆనవాయితీగా వస్తున్నది. ప్రస్తుతం కేసీఆర్ సైతం అదే స్ట్రాటజీతో కేసీఆర్ ఉన్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏడున్నర దశాబ్దాల పాలనలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సహా కొంతకాలం పాలించిన ఫ్రంట్ ప్రభుత్వాలు దేశాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాయని, ఇందుకు కారణం నేతలకు విజన్ లేకపోవడమేనని పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు అన్నారు. ‘నేడు తెలంగాణ ఆచరిస్తున్నది.. రేపు దేశం అనుసరిస్తున్నది..’ అంటూ ప్రస్తావిస్తున్న బీఆర్ఎస్ నేతలు దేశానికి కేసీఆర్ లాంటి ప్రధాని కావాలని గొప్పగా చెప్పుకుంటున్నారు. జాతీయ నేతగా గుర్తింపు పొందేందుకు నాలుగైదేండ్లుగా ఫ్రంట్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టిన కేసీఆర్.. గతేడాది నుంచి ఈ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ పేరుతో పలు ప్రాంతీయ పార్టీల నేతలను స్వయంగా కలిసి చివరకు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి సైతం దగ్గరవుతున్నారు.

సంచలనం రేపిన రాజ్‌దీప్ కామెంట్స్

రాజ్‌దీప్ చేసిన రాజకీయ విశ్లేషణ రెండు రోజులుగా జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఇప్పటికే కేసీఆర్‌పై విపక్షాలు ఎలక్షన్ ఫండింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అఖిలేశ్ యాదవ్‌కు, పంజాబ్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్‌కు, ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి కేసీఆర్ ఫండింగ్ చేసినట్టు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌టీపీ లాంటి పలు పార్టీలు ఆరోపణలు చేశాయి. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచి కమిషన్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని, ఆ డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్నారంటూ ఇప్పటికీ కేసీఆర్‌పైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్‌దీప్ సర్దేశాయ్ సైతం తన విశ్లేషణలో ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. కేసీఆర్ తన సన్నిహితులతో చేసిన ప్రైవేటు సంభాషణల అంశాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడితే, దానికి తనను చైర్‌పర్సన్‌గా నియమిస్తే ఎన్నికల క్యాంపెయిన్‌కు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని రాజ్‌దీప్ చెప్పుకొచ్చారు. వివిధ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారంటూ పలు ప్రధాన పార్టీలు చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చేలా రాజ్‌దీప్ కూడా తాజాగా తన విశ్లేషణలో ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఆయన అభిప్రాయం, వ్యాఖ్యానంలోని వాస్తవాల సంగతి ఎలా ఉన్నా కేసీఆర్ పొలిటికల్ ఫండింగ్ అంశం మరోసారి చర్చకు దారితీసింది.

కేసీఆర్‌కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ భయం!

బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఇప్పుడు విపక్షాలతో కలసి జత కట్టాలని కోరుకోడానికి నిర్దిష్ట కారణం ఉన్నదన్నారు రాజ్‌దీప్. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆయన కూతురిని ఈడీ, సీబీఐ సంస్థలు విచారిస్తుండం కావొచ్చని, ఇందులో ఆశ్చర్యమే లేదని పేర్కొన్నారు. నరేంద్రమోడీ, ఈడీ పట్ల కేసీఆర్‌కు ఉన్న భయం ఇందుకు కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల వ్యూహంలో బీఆర్ఎస్‌ను సైతం భాగస్వామిగా చేయాలన్న కేసీఆర్ ఆలోచనకు ఇది కారణం కావచ్చన్నారు. కవితను ఈడీ ఇప్పుడు విచారిస్తూ ఉన్నదని గుర్తుచేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా ప్రతిపక్షాలతో జతకట్టడానికి కారణం తన మంత్రివర్గంలోని మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ ఈడీ కేసుల్లోనే జైల్లో ఉండడమేని పేర్కొన్నారు. నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ భావజాలంతో ఉన్న ఎనిమిది పార్టీలతో ఇటీవల ఢిల్లీలో విందు సమావేశానికి ప్రయత్నించారని, కానీ చివరి నిమిషంలో అది రద్దయిందన్నారు. చివరకు కాంగ్రెస్‌తో కలిసి విపక్ష పార్టీల సరసన చేరాలని నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత ఇతర రాష్ట్రాల్లోకి కార్యకలాపాలను విస్తరింపజేస్తున్న కేసీఆర్.. జాతీయ పార్టీ స్థాయికి ఎదగాలనుకుంటున్నట్టు రాజ్‌దీప్ పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలను రాజ్‌దీప్ సర్దేశాయ్ గత కొంతకాలంగా నిశితంగానే గమనిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో స్వయంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. ఎన్నికల క్యాంపెయిన్‌లో ఉన్న కేసీఆర్‌ను ఇంటర్వ్యూ చేశారు. పార్టీకి ప్రజల్లో ఉన్న పట్టు, అధికార పార్టీగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి విశ్లేషించారు. ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారిన తర్వాత నాన్-బీజేపీ పార్టీల మద్దతుతో ఏర్పడే ప్రతిపక్షాల కూటమితో జతకట్టడానికి దారితీసిన కారణాలను విశ్లేషించారు.

కొందరు ప్రాంతీయ నేతలు సైలెంట్!

మాయావతి, వైఎస్ జగన్ లాంటివారు తటస్థ పాత్రను పోషిస్తున్నా బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారని, ఇందుకు కారణం దర్యాప్తు సంస్థల భయమేనని రాజ్‌దీప్ అన్నారు. భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే.. దాని ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న ఆందోళన సైతం ఇందుకు కారణమన్నారు. జగన్ కూడా ఇలా ఆలోచిస్తూనే బీజేపీకి అనుకూలంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు సైతం 2019లో మోడీకి వ్యతిరేకంగా వ్యవహరించినా ఈసారి మాత్రం లో ప్రొఫైల్‌లో ఉన్నారని, కేవలం ఆంధ్రపై మాత్రమే ఫోకస్ పెట్టి ఢిల్లీ గురించి పెద్దగా పట్టించుకోవడంలేదన్నారు.

రాజ్‌దీప్ ఇంకా ఏమన్నారంటే...

రానున్న పార్లమెంటు (2024) ఎన్నికలు మోడీ వర్సెస్ అపోజిషన్ పార్టీలుగా ఉండనున్నాయని, ఇందులో వివిధ ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత పలు బీజేపీయేతర పార్టీలు దాన్ని ఖండించాయని, ఇదే సందర్భంలో ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వివిధ ప్రతిపక్షాలకు ఢిల్లీలో ఇచ్చిన విందుకు 19 పార్టీలు హాజరయ్యాయన్నారు. అందులో బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉన్నాయన్నారు. వీర సావర్కార్‌పై రాహుల్‌గాంధీ చేసిన కామెంట్లపై అసంతృప్తితో శివసేన హాజరుకాలేదని, అది కూడా వచ్చి ఉన్నట్లయితే మొత్తం విపక్ష పార్టీలు సంఖ్య 20 అయ్యేదన్నారు. మోడీ వర్సెస్ అపోజిషన్ వ్యవహారంలో మొత్తం పది అంశాలను రాజ్‌దీప్ తన విశ్లేషణలో ప్రస్తావించారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీలు ఒక్కటవుతున్నాయని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ కూడా అందులో ఉన్నదన్నారు. కాంగ్రెస్‌తో స్నేహసంబంధాల్లో లెఫ్ట్ పార్టీలు కొనసాగుతున్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంను రాజకీయ ప్రత్యర్థిగా తృణమూల్ భావిస్తున్నా ఈ కూటమితో జతకట్టిందని ఉదహరించారు. ఈ కూటమిలో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలకు వారి సొంత అభిప్రాయాలు, ఉన్నత స్థానంలో ఉండాలనే ఆకాంక్షలు ఉన్నాయన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు అంశం ఈ పార్టీలను ఒకటిగా చేయడానికి దారితీసిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారందరినీ కాదని కేసీఆర్ లాంటి వ్యక్తికి ప్రతిపక్షాల కూటమి చైర్‌పర్సన్ బాధ్యతలను అప్పగించడం సాధ్యమవుతుందా? అని రాజ్‌దీప్ తన విశ్లేషణలో ప్రస్తావించారు. కచ్చితంగా ఇది సాధ్యం కాకపోవచ్చని, ఇందుకు కొద్దిమందిలో ఉన్న ‘ఈగో’ అంశాలు కారణమని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. ప్రతిపక్షాలన్నీ ఒకే గూటి కిందకు చేరడానికి మరో కారణం కూడా ఉన్నదని, అవి కేంద్ర దర్యాప్తు సంస్థలపట్ల ఉన్న భయం అని పేర్కొన్నారు. నరేంద్ర మోడీకి, ఈడీకి ఆ పార్టీలు భయపడుతున్నాయన్నారు. రాజకీయ నేతలపై ఈడీ నమోదు చేసిన మొత్తం కేసుల్లో 95% ప్రతిపక్షాల నేతలపైనే అని గుర్తుచేశారు.

ప్రధాని అయ్యేది ఎవరు?

నితీశ్, మమతాబెనర్జీ, కేసీఆర్, స్టాలిన్.. తదితరులంతా ప్రధాని స్థాయికి తగినవారేనని చెప్పుకుంటున్నారు. గతేడాది జూలైలో మమతా బెనర్జీని తాను కలిసినప్పుడు ప్రతిపక్షాలను నడిపించేదెవరంటూ అడిగానని రాజ్‌దీప్ గుర్తుచేశారు. ఈ దేశ ప్రజలు నడిపిస్తారని, పీపుల్ వర్సెస్ మోడీగా ఉంటుందని జవాబిచ్చారని వివరించారు. ఇప్పుడు ప్రజలు కూడా ప్రతిపక్షాల ఫేస్ ఎవరని తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. ఎన్నికలకు ముందే అది వెల్లడి కావాల్సి ఉన్నదన్నారు. ప్రతిపక్షాలు ఎన్నికలకు ముందే ఇప్పుడు ఫలానా వ్యక్తి ప్రధాని అభ్యర్థి అంటూ చెప్పగలవా? అని ప్రశ్నించారు. నిజంగా అదే జరిగితే ఆ పేరును వెల్లడించాలని, అప్పుడే మోడీకి వ్యతిరేకంగా గ్రాండ్ అలయెన్స్ ఏర్పాటు తథ్యమనే నమ్మకం ప్రజల్లో కుదురుతుందన్నారు. మోడీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు 400 సీట్లకు ఒక బ్లూ ప్రింట్‌ను తయారుచేశాయని తెలిసిందన్నారు. ఫేస్ టు ఫేస్‌గా బీజేపీతో తలపడే సీట్లే అవి అన్నారు. దీనికి అన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ త్యాగం చేయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ కేవలం 200 సీట్లలో మాత్రమే పోటీచేసి మిగిలినవాటికి ప్రాంతీయ పార్టీలకు వదిలివేయాల్సి ఉంటుందన్నారు. నిజంగా ఇది సాధ్యమవుతుందా? కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చాటుకునే సత్తా తర్వాత మరింత క్లారిటీ వస్తుందని, ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ కలిపి నిజంగా ఒకే ఫ్రంట్ కిందికి రావడం సాధ్యమవుతుందా? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయని, ఇలాంటప్పుడు ఒకే కూటమిగా ఏర్పడడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

Also Read..

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన బీజేపీ సీనియర్ నేత


Next Story

Most Viewed