నేడు మళ్లీ తీహార్ జైలుకు కవిత.. అరెస్టయి నెల రోజులైనా పరామర్శించని కేసీఆర్

by Disha Web Desk 2 |
నేడు మళ్లీ తీహార్ జైలుకు కవిత.. అరెస్టయి నెల రోజులైనా పరామర్శించని కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ కేసులో కవిత అరెస్టయి సోమవారానికి సరిగ్గా నెల రోజులు అవుతుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆమె తండ్రి మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించలేదు. కనీసం అరెస్టు అంశాన్ని కూడా ప్రస్తావించకపోవడం పార్టీలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. కేటీఆర్ మాత్రం రెండోసారి కవితతో భేటీ అయ్యారు. అయితే సీబీఐ కస్టడీ ముగుస్తుండటంతో రౌస్ ఎవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ నెలకొంది.

స్పందించకుండా..సస్పెన్స్ కంటిన్యూ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను ఇరవై రోజులుగా తిహార్ జైల్లోనే ఉంచారు. కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు‌ను సీబీఐ కోరగా అందుకు మూడ్రోజుల అనుమతి ఇచ్చింది. అయితే ఆ కస్టడీ సోమవారంతో ముగుస్తుంది. సోమవారంతో కవిత అరెస్టు సరిగ్గా నెలరోజులు అవుతుంది. అయినప్పటికీ అరెస్టుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించలేదు. ఇప్పటివరకు ఆమెతో మాట్లాడలేదు. భేటీ కాలేదు. కేవలం కవిత తల్లి శోభ మాత్రం కలిశారు. కేసీఆర్ తీరు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకు స్పందించడం లేదు...స్పందిస్తే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి నష్టం జరుగుతుందా? అని ఆలోచిస్తున్నారా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అన్నది మాత్రం సస్పెన్స్ నెలకొంది.

నేటితో సీబీఐ కస్టడీ ముగింపు...

ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీలో ఉంది. ప్రస్తుతం సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారుల ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఆమె కస్టడీ సోమవారంతో ముగిస్తుంది. ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో ఉదయం 10 గంటలకు అధికారులు హాజరు పర్చనున్నారు. అయితే సీబీఐ కస్టడీని పొడిగించాలని పిటిషన్ వేసే అవకాశాలున్నట్టు సమాచారం. ఒకవేళ పిటిషన్ వేయకపోతే మళ్లీ జైలుకు పంపించే అవకాశం ఉందని తెలిసింది. అసలు సోమవారం ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

కవితతో కేటీఆర్ భేటీ

లిక్కర్ కేసులో అరెస్టయిన కవితతో రెండ్రోజుల వ్యవధిలోనే మార్చి 17న కేటీఆర్ భేటీ అయ్యారు. నాలుగైదురోజులపాటు ఢిల్లీలోనే ఉండి ప్రతి రోజూ భేటీ అయ్యి దైర్యం చెప్పారు. అయితే సోమవారం సీబీఐ కస్టడి ముగుస్తుండటంతో ఆదివారం సాయంత్రం కవితతో రెండోసారి కేటీఆర్ భేటీ అయ్యారు. ఆయన వెంట కవిత భర్త అనిల్ కుమార్, లాయర్ మోహిత్ రావు ఉన్నారు. ఈ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ కేటీఆర్ సోదరిని కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కస్టడీలో అడిగిన ప్రశ్నలు, ఈ కేసుకు సంబంధించి లీగల్‌ యాక్షన్‌పై సుమారు గంట పాటు సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.

బెయిల్ పిటిషన్ ఆలోచనలో కవిత

సీబీఐ సోమవారం కస్టడీ పిటీషన్ వేయకపోతే ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ వేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందుకోసం లాయర్ మోహిత్ రావుతో చర్చించినట్టు సమాచారం. ఏయే అంశాలపై బెయిల్ కోరుతూ పిటిషన్ వేయాలి..అందుకు సంబంధించిన డాక్యుమెంట్ల తయారీపైనా డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది.

కవితను విచారించిన సీబీఐ అధికారులు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గత రెండేళ్లుగా అనేక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు సేకరించిన తర్వాత కవితను, అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. అయితే, ఈడీ విచారణతో పోలిస్తే సీబీఐ మరికొంత అదనపు సాక్షాలను సేకరించింది. కవిత కస్టడీ రిపోర్టులో అనేక సంచలన విషయాలు చెప్పింది. మద్యం పాలసీ కేసులో అసలు సూత్రధారి, పాత్రధారి కవితేనని ఆరోపించింది. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారిని కేజ్రీవాల్‌కు పరిచయం చేసిందే కవితని సీబీఐ తెలిపింది. ఆదివారం విచారణలో శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా అడిగినట్టు సమాచారం. శరత్ చంద్రారెడ్డి ఎలా పరిచయం? ఎన్నిసార్లు కలిశారు? అని సీబీఐ ప్రశ్నించినట్టు తెలిసింది. మహబూబ్‌నగర్‌లోని రూ.14 కోట్ల అగ్రికల్చర్ ల్యాండ్‌ను బలవంతంగా శరత్ చంద్రా‌రెడ్డికి అమ్మారని, దీనికి సంబంధించి ఆయన వాంగ్మూలం, తగిన సాక్ష్యాలను ముందుపెట్టి మరీ కవితను సీబీఐ ఇంటరాగేట్ చేసినట్టు సమాచారం.


Next Story