కేటీఆర్ కు చేవెళ్ల అభ్యర్థిగా కాసాని షాక్.. కేసీఆర్ సభలోనైనా సీన్ మారేనా?

by Disha Web Desk 13 |
కేటీఆర్ కు చేవెళ్ల అభ్యర్థిగా కాసాని షాక్.. కేసీఆర్ సభలోనైనా సీన్ మారేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. రూరల్, అర్బన్ ప్రాంతాలతో సమ్మిళితమైన ఈ నియోజకవర్గంపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అధికార కాంగ్రెస్ నుంచి రంజిత్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరడంతో ఇక్కడ ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్‌గా తీసుకున్నారు. కానీ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అభ్యర్థిగా ప్రకటించి వారాలు గడుస్తున్నా కాసాని ప్రచార పర్వానికి తెరలేపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భేటీలకే పరిమితం

చేవెళ్లలో గులాబీ జెండా ఎగరవేసి రంజిత్‌రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్షతో కేటీఆర్ ఉన్నారు. కానీ ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే గులాబీ పార్టీ అభ్యర్థి మాత్రం కేవలం నియోజకవర్గ స్థాయి నేతలతో భేటీలకే పరిమితం అవుతున్నారనే టాక్ పొలిటికల్ కారిడార్‌లో వినిపిస్తోంది. దీంతో ప్రతిష్టాత్మకమైన స్థానంలో ప్రచారం విషయంలో ఈ నిర్లక్ష్య ధోరణి ఏంటి? అనే చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లకపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కేసీఆర్ ఎంట్రీతో పరిస్థితి మారేనా?

చేవెళ్ల విషయంలో స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇవాళ చేవెళ్లలో సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు చేవెళ్లలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఈ సభ ద్వారా కేడర్‌లో కొత్త జోష్ నింపాలని భావించిన బీఆర్ఎస్‌కు కాసాని తీరుతో నీరుగారినట్లుగా పరిస్థితి మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడుతున్న కేసీఆర్.. ఈ సభలో ఎవరిని ఏ రీతిలో అటాక్ చేయబోతున్నారు? అనేది ఆసక్తిగా మారింది. అయితే కేసీఆర్ సభ ద్వారానైనా కాసాని పూర్తిస్థాయిలో ప్రచారానికి దిగుతారా లేదా? అనేది వేచి చూడాలి.


Next Story