ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తా.. : బండి సంజయ్

by Aamani |
ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తా.. : బండి సంజయ్
X

దిశ,కరీంనగర్ : భూకబ్జాలు, లంచాలతో కోట్లాది రూపాయలు దండుకున్న గంగుల కమలాకర్ కు తన గురించి వ్యాఖ్యానించే నైతికత లేదని, ధర్మ స్థాపనకు బీజేపీ ఆధ్వర్యంలో తాను పోరాడుతుంటే, అవినీతి అక్రమాలే ధ్యేయంగా గంగుల ముందుకు సాగుతున్నారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన గంగుల రాష్ట్ర ప్రజలను పక్కనబెడితే, కనీసం నియోజకవర్గంలోని ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు అందించారా..? కరీంనగర్ కు చెందిన ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్ రూం అందించారా..? అని ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్ లోని సుభాష్ నగర్ లో బండి ప్రచారం నిర్వహించగా, గాంధీ విగ్రహం వద్దకు తరలివచ్చిన ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశ్వకర్మ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది విశ్వకర్మ సంఘం నాయకులు, సభ్యులు బండి సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకెళ్ళిన చరిత్ర తనదని, భూకబ్జాల , అవినీతికి పాల్పడ్డ ఘనత గంగులదని విమర్శించారు.

మంత్రిగా ఉంటూ రేషన్ కార్డులు, ఇండ్లు, ఉద్యోగాలు ఇవ్వని గంగుల కమలాకర్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల బాగోగుల కోసం తాను పోరాడుతుంటే పదేపదే అవినీతి మరక వేస్తూ బీఆర్ఎస్ నేతలు బూతులు తిడుతున్నారని అసలు తాను చేసిన పాపమేంటని ప్రశ్నించారు. ఎంపీగా ఉంటూ 9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చానని, స్మార్ట్ సిటీ, ఆర్వోబీ, రోడ్లకు నిధులు తెచ్చానన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోడీ తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నట్లు. ఎంపీ టికెట్ ఇస్తానంటే వద్దని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని బండి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై తాను పోరాడుతుంటే.. కేసీఆర్, గంగుల కమలాకర్ కలిసి తనపై దాడి చేసి జైలుకు పంపారన్నారు. కరీంనగర్ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని, ప్రజలను మోసం చేసి దోచుకుంటుందెవరో..? మీ కోసం కొట్లాడేదెవరో..? ఆలోచించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తు పై ఓటీసీ తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి, అవినీతికి తావులేని అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేయాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.Next Story

Most Viewed