పంట నష్టంపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం : జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

by Disha Web Desk 1 |
పంట నష్టంపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం : జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
X

దిశ, కరీంనగర్ టౌన్: రైతులు అధైర్యపడొద్దని, జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, పంట నష్టంపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. నేడు కరీంనగర్ గ్రామీణ మండలం నగునూర్, నియోజకవర్గంలోని గ్రామాల్లో సోమవారం నాటి వడగళ్ల వాన, ఈదురు గాలులతో జరిగిన పంట నష్టాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పరిశీలించారు.

ఈ సందర్బంగా నగునూర్ గ్రామానికి చెందిన దామరపెల్లి బాపురెడ్డి, చాకుంట గ్రామానికి చెందిన పురం రవి సాగు చేసిన వరి పంటతో పాటు మరో నాలుగు ఎకరాల్లో నష్టపోయిన మిర్చి పంటను పరిశీలించారు. పంటకోతకు వచ్చిన సమయంలో భారీ వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులెవరూ అదైర్యపడోద్దని, ప్రతి రైతుకు పంట నష్టాన్ని ఇప్పించేందుకు నివేదికను సిద్ధం చేయించి ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ తెలిపారు.

అనంతరం పంట నష్టాన్ని గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకొని వెంటనే పంటనష్ట నివేదికను సిద్ధం చేయించాలని ఆదేశించారు. అంతకు ముందు నగునూరు గ్రామంలోని ఐకేపీ పాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, తడిసిన ధాన్యాన్ని వెంటనే ఆరబెట్టాలని, కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వర్షాలకు తడవకుండా టార్పలిన్లను వాడాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ధాన్యంలో తాలు వంటివి లేకుండా చూడాలని, ధాన్యం తడిసినా కూడా కొనుగోలు చేస్తామని తెలిపారు. అనంతరం ఐకేపీ నిర్వహకులతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, ఎక్కడా ఎటువంటి అలసత్వం చూపించవద్దని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్, చొప్పదండి తహసీల్దార్ సరిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed