పాలక వర్గాలు సరే...కొనుగోళ్ల జాడేది..?

by Aamani |
పాలక వర్గాలు సరే...కొనుగోళ్ల జాడేది..?
X

దిశ, పెగడపల్లి : మండలానికి ప్రత్యేక మార్కెట్ కమిటీ ఏర్పాటు జరిగిందని దానితో అన్ని రకాల పంటలను అమ్ముకోవడానికి దూరం వెళ్లాల్సిన శ్రమ తప్పింది అని ఆశించిన మండల రైతులకు నిరాశే మిగిలింది. మార్కెట్ కమిటీ కి పాలక వర్గాలను నియమించడం తప్ప పంటల కొనుగోళ్లు లేక మార్కెట్ కమిటీ అలంకార ప్రాయంగా మిగిలింది.మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ మీద దిశ ప్రత్యేక కథనం..

తెలంగాణ తొలి ప్రభుత్వంలో మార్కెట్ కమిటీ ఏర్పాటు..

ఉమ్మడి రాష్ట్రంలో పెగడపల్లి, గొల్లపల్లి మండలాలు కలిపి గొల్లపల్లి లో మార్కెట్ కమిటీ ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలానికి మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయడంతో పెగడపల్లి మండలానికి ప్రత్యేక మార్కెట్ కమిటీ ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా పాలక వర్గం కూడా ఏర్పడడం, మార్కెట్ కమిటీ కార్యాలయం నిర్మించడం, 2500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాం నిర్మాణం చేశారు. దీంతో తమ పంటలను స్థానికంగానే అమ్ముకోవచ్చు అని మండల రైతాంగం ఎంతో సంతోషిస్తే ఆచరణలో మాత్రం వారికి నిరాశే మిగిలింది. కేవలం పాలకవర్గం ఏర్పాటు తప్ప మార్కెటింగ్ శాఖ తరపున ఇక్కడ ఒక్క గింజ కొనుగోలు జరిగింది లేదు. మండల వ్యాప్తంగా ఐ కే పి, పి ఎ సి ఎస్ కేంద్రాల్లో కొనుగోళ్ళు జరిగిన ధాన్యం తరలింపులో మార్కెట్ కమిటీ తరపున తనిఖీ ద్వారా వచ్చే అరకొర ఆదాయం తప్ప మరేమీ ప్రయోజనం లేకుండా పోయింది.

ప్రజా ధనం వృధా.. ప్రయోజనం కల్ల..

మార్కెట్ కమిటీ ఏర్పాటు జరిగిన నుండి ఇప్పటి వరకు మూడు పాలక వర్గాల నియామకం జరిగింది. అయితే ఆ పాలక వర్గం కి ఇచ్చే పారితోషికం, పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంలో అయ్యే ఖర్చు వల్ల ప్రజా ధనం వృధా అవుతుంది తప్ప రైతులకు ప్రయోజనం జరిగేది ఏముందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికీ రైతులు తాము పండించిన మొక్క జొన్న, పత్తి,పసుపు లాంటి పంటలను ఇతర మండలాలైన గొల్లపల్లి,చొప్పదండి మార్కెట్ లకు తరలించి అమ్ముకోవాల్సి వస్తుందని రవాణా భారం పెరిగి రైతులకు ఏమి గిట్టుబాటు అవడం లేదని రైతులు వాపోతున్నారు.ఇప్పటికైనా నూతన ప్రభుత్వం లో అయిన మార్కెటింగ్ శాఖ తరపున మండలం లో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ లో పంటల కొనుగోలు జరిగేలా చర్యలు చేపట్టాలని మార్కెట్ కమిటీల స్థాపనకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story