సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Sumithra |
సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ, చందుర్తి : సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చందుర్తి వారి ఆధ్వర్యంలో మూడపల్లి గ్రామంలో నిర్మించిన నూతన పెట్రోల్ బంక్ ను కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు కొండూరు రవీందర్ రావుతో కలిసి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. గతంలో సహకార బ్యాంకులు చాలా నష్టాల్లో ఉండేవని, కానీ ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మెరుగు పడిందన్నారు. వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు ఇచ్చామా తీసుకున్నామని కాకుండా సంఘాలు ఆయా ప్రాంతాలకు ఉన్నటువంటి రైతాంగానికి అనుగుణంగా ఉపాధి మార్గాలను తీసుకువచ్చి రైతుల ద్వారా అభివృద్ధి పదాన్ని తీసుకుపోయేలా చేయాలన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలో జిల్లా కలెక్టర్ తో సమావేశం ఏర్పరిచి రైతులకు అందుబాటులో గోదాంలు ఏర్పాటు చేశామన్నారు. గోదాం నిర్మాణం చేపట్టడం వలన రైతులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు.

రైతులకు మేలైన వంగడాలు అందించే విధంగా ఫర్టిలైజర్ దుకాణ యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మేలైన వంగడాలు సరఫరా చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 9 ప్రాజెక్టులలో మొదటి క్రమంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును చేర్చారని, ఇందులో భాగంగా కలికోట సూరమ్మ చెరువు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. కొత్తగా నూకలమర్రిలో లొంక చెరువును, ఆశిరెడ్డి పల్లిలో కొత్తచెరువు, సనుగుల ఎర్ర చెరువు పటేల్ చెరువులను అనుసంధానం చేయడానికి సంకల్పించాం. మీరు చెప్పిన సూచనలు సలహాలు తీసుకుంటూ మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం అని అన్నారు. ఈ పెట్రోల్ బంక్ ద్వారా నాణ్యమైన డీజిల్, పెట్రోల్ వినియోగదారులకు, రైతులకు సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్ రావు, సింగిల్ విండో డైరెక్టర్లు మాజీ సర్పంచులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ అంచ రాంరెడ్డి నాయకులు పాల్గొన్నారు.

Next Story