పురాతన ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి.. మంత్రి కొప్పుల ఈశ్వర్

by Disha Web Desk 20 |
పురాతన ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి.. మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, వెల్గటూర్ : తెలంగాణ వారసత్వ సంపదను కాపాడు కోవడంతో పాటు హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా పురాతన ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామంలోని పురాతన శివాలయం అయిన శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి ఆలయానికి రూ.2.5 కోట్ల నిధులతో ఐదంతస్తుల గాలి గోపురం నిర్మాణానికి భూమి చేసి బుధవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆలయానికి విచ్చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఈవో కాంతారెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ పదిర నారాయణరావు ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పురాతన ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ప్రజలందరూ గర్వంగా భావించాలన్నారు. కోటిలింగాల పార్వతీ కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సీఎం నిధులు విడుదల చేయగా మెగా సహకారంతో కోటిలింగాలకు పూర్వ వైభవం రాబోతుందన్నారు. ఈ ఆలయాన్ని పూర్తిగా జీర్ణోద్ధరణం చేసి త్రికూట ఆలయం మాదిరిగా నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ సాలహారం లోపల విశాలమైన మండపం నిర్మాణం జరగబోతుందని వివరించారు. పవిత్ర గోదావరి తీరంలోని చారిత్రక ప్రదేశంలో ప్రాచీన కాలంలో మునుల పర్యవేక్షణలో ఈ ఆలయం నిర్మించబడిందన్నారు. దీనికో ప్రత్యేకమైన చరిత్ర కలదన్నారు. పూరి మొక్కుతే భక్తుల కొంగుబంగారమై కోటీశ్వరుడు కోరికలు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. మునుల చేత కోటి ఇసుక రేణులతో గర్భగుడిలో ప్రతిష్టించ బడిన శివలింగం దేశంలో మరెక్కడ లేదన్నారు.

ఇప్పటికీ దీనిని సైకత లింగం అనే పిలుస్తారు. ఈ ఆలయాన్ని రక్షించుకొని అభివృద్ధి చేయడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగోడినేలగా గుర్తింపు పొందిన కోటిలింగాలకు పూర్వవైభవం తేవడానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ చారిత్రక ప్రదేశం అభివృద్ధి కోసం గాలిగోపురం నిర్మాణం రూపంలో ఇప్పుడే బీజం పడింది. సీఎం కేసీఆర్ తో పాటు మెగా కంపెనీ సహకారంతో ఆలయ అభివృద్ధితో పాటు ఈ చారిత్రక ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతానని, దానికి కావాల్సిన పనులు కంపెనీ ఆధ్వర్యంలో ఇప్పటికే జరుగుతున్నాయని వెల్లడించారు. రాజగోపురం నిర్మాణంలో భాగంగా ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆలయ చైర్మన్, ఈవోకు సూచించారు.

ప్రజల సాధకబాధకాల్లో వెన్నంటూ ఉండి సేవలు అందిస్తున్న ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు సాగునీరు తాగునీరు కోసం గోసపడ్డ ఈ ప్రాంత ప్రజలు నేడు బంగారు పంటలు పండిస్తూ హాయిగా కాలం గడపడం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి నిత్యం ఇతర పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని గర్వంగా చెప్పారు. ఇందులో భాగంగానే వెల్గటూరు మండల కేంద్రంలో ఒడ్డెర కాలనీకి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బీ.సుధా రామస్వామి, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్ పదిర నారాయణరావు టీఆర్ఎస్ మండల కార్యదర్శి జూపాక కుమార్,దేవేందర్ రెడ్డి మూగల సత్యం, మనీష్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed