సామాన్యులను మోసం.. అక్రమ మార్గంలో ప్లాట్ల విక్రయాలు

by Disha Web Desk 4 |
సామాన్యులను మోసం.. అక్రమ మార్గంలో ప్లాట్ల విక్రయాలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో రియల్ మాఫియా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంథని సమీపంలో ఏర్పాటు చేసిన వెంచర్లలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి మరీ రియల్టర్లు సామాన్యులను నిట్ట నిలువునా మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా చేస్తున్న ఈ దందాలో కనీసం రహదారులు కూడా విస్తారంగా ఏర్పాటు చేయడం లేదని వారు తయారు చేసుకున్న లే ఔట్ మ్యాపులు తేటతెల్లం చేస్తున్నాయి. 33 ఫీట్ల వెడల్పుతో ఉండాల్సిన రహదారులకు గాను కేవలం 20 ఫీట్లలో నిర్మిస్తున్నామని వివరించడం గమనార్హం. లే ఔట్ కు డీటీసీపీ అనుమతి కూడా తీసుకోకుండా మార్కెటింగ్ చేస్తున్నా పట్టించుకునే వారు కూడా కరువయ్యారు. డీటీసీపీ అప్రూవల్ కోసం దరఖాస్తు చేస్తే అందుకు తగ్గట్టుగా ఫీజులతో పాటు కమ్యూనిటీ అవసరాలు, డెవలప్ మెంట్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని భావించిన రియాల్టర్లు అక్రమ మార్గంలో ప్లాట్ల విక్రయాలు చేస్తున్నారు. లౌ ఔట్ మ్యాపులో బాజాప్తాగా రెసిడెన్షియల్ ప్లాట్ల కోసం డిజైన్ చేస్తున్నామని రాసి మరి దందా చేస్తున్నా నియంత్రించేందుకు అధికారులు సాహసించకపోవడం విస్మయం కల్గిస్తోంది.

మంథని సమీపంలో సాగుతున్న ఈ అక్రమ వెంచర్లపై కొరడా ఝులిపించకపోతే అందులో ప్లాట్లు కొన్న సామాన్యులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ఈ వ్యవహారాలపై పంచాయితీ అధికారులు కానీ, డీటీసీపీ అధికారులు కాని దృష్టి సారించకపోవడం వల్లే ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మంథని సమీపంలోని సూరయ్యపల్లి పంచాయితీ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ వెంచర్ మ్యాపున పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ మాఫియా ఎంతటి సాహసం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అదికారులు అక్రమ లౌ ఔట్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు మంథని ప్రాంత ప్రజలు.

Next Story

Most Viewed