అంగరంగ వైభవంగా రాములోరి రథోత్సవం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

by Disha Web Desk 23 |
అంగరంగ వైభవంగా రాములోరి రథోత్సవం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
X

దిశ,జమ్మికుంట: అపర అయోధ్య గా భాసిల్లుతున్న ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చంద్ర రథోత్సవం (పెద్ద రథం) అంగరంగ వైభవంగా కొనసాగింది. బుధవారం రాత్రి 10:00 గంటల ప్రాంతంలో ఉత్సవ మూర్తులైన శ్రీ సీతా, లక్ష్మణ సమేతుడైన రామచంద్ర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ పుష్ప విరాజీతమైన చంద్రరథం పైకి తీసుకురావడంతో అప్పటికే దేవతామూర్తుల రాక కోసం ఎదురు చూస్తున్న భక్తజనం అంతా ఒక్కసారిగా జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంతో నినదించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యూ లైన్ ల ద్వారా భక్తులు రథం పై కొలువుదీరిన దేవతామూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అనాదిగా వస్తున్న రథం పై టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవాలనే భక్త జనాల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ వెల్లివిరిసింది. బుధవారం రాత్రి నుండి గురువారం సాయంత్రం 6 గంటల వరకు భక్తులు స్వామి వార్లను దర్శించుకున్నారు. దర్శనం కోసం కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి తదితర జిల్లాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రథం పై ఉన్న ఉత్సవ మూర్తులను దర్శించుకున్న అనంతరం గర్భ గుడిలో స్వయంభూగా వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి ని దర్శించుకోవడం తో ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనసందోహంతో చంద్రరతాన్ని తాళ్లతో లాగుతూ ఆలయం చుట్టూ ఊరేగించారు.

పోలీసుల బందోబస్తు..

చంద్ర రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ పర్యవేక్షణలో జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్ ఆధ్వర్యంలో ఇల్లందకుంట, వీణవంక ఎస్సైలు రాజ్ కుమార్, తిరుపతి లు భారీ బందోబస్తు నిర్వహించారు. కాగా పలువురు ప్రజా ప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సుధాకర్, ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed