శ్రీ రామనవమి వేడుకలకు ముస్తాబైన రాజన్న క్షేత్రం

by Disha Web Desk 23 |
శ్రీ రామనవమి వేడుకలకు ముస్తాబైన రాజన్న క్షేత్రం
X

దిశ,వేములవాడ, సిరిసిల్ల ప్రతినిధి : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలకు ముస్తాబైంది. ఈరోజు సోమవారం నుంచి మూడు రోజుల పాటు కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో రేపు,(నేడు) 17న బుధవారం ఉదయం 11.59ని.లకు శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం( భక్తోత్సవం) అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం పూర్ణాహుతి తదుపరి రథోత్సవము, డోలోత్సవము (వసంతోత్సవము) వంటి ప్రత్యేక కార్యక్రమాలను అర్చకులు కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

శివయ్య చెంతకు శివ పార్వతులు..

వాస్తవానికి దేశవ్యాప్తంగా జరిగే శ్రీ రామనవమి వేడుకల్లో అత్యధిక భాగం కేవలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి ఆలయాల్లోనే జరుగుతాయి. కానీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో ప్రతి ఏటా శ్రీ రామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే వేడుకలకు వచ్చే భక్తుల్లో అత్యధిక సంఖ్యలో శివ పార్వతులే. వీరు కల్యాణ వేడుకల్లో పాల్గొని శివయ్యను లగ్నం(పునరుద్ధరణ) చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.. అదే ఇక్కడి మరో ప్రత్యేకత

ప్రత్యేక ఆకర్షణగా హిజ్రాలు..

రాజన్న చెంత అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీ రాములోరి కళ్యాణ వేడుకలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో హిజ్రాలు తరలివచ్చి, శ్రీ సీతారాముల కల్యాణ క్రతువు కొనసాగుతున్న సమయంలో హిజ్రాలు ఒకరినొకరు తలంబ్రాలు పోసుకొని, తాళి కట్టుకుని వారికి వారే కల్యాణం జరిపించుకుంటారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత, ఆనవాయితీ కూడా. ఈ క్రమంలో ప్రతి ఏడాది వలే ఈ ఏడాది సైతం కళ్యాణ వేడుకల్లో హిజ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు..

రేపు,(నేడు) జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించడానికి సాధారణ భక్తులు, శివ పార్వతులు, హిజ్రాలు సుమారు లక్ష మంది వరకు తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయ చైర్మన్ అతిథి గృహం ముందు కళ్యాణం జరిపించేందుకు ఇప్పటికే వేదికను సిద్ధం చేశారు. ఆలయ లోపలి భాగంలో యాగశాలను ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. వేసవి కాలం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి వసతి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కళ్యాణం వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాట్లు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.


Next Story