పోలీసుల్లో పదోన్నతుల లొల్లి.. సోషల్ మీడియాలో హల్‌చల్

by Disha Web Desk 4 |
పోలీసుల్లో పదోన్నతుల లొల్లి.. సోషల్ మీడియాలో హల్‌చల్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ అనాలోచిత చర్య వల్ల వందలాది మంది బలి అవుతారన్న మాటకు పోలీసు అధికారుల పదోన్నతుల ప్రక్రియే నిదర్శనం. పాలకులు చేసిన ఈ తప్పిదం దశాబ్దాల పాటు పోలీసు అధికారులను వెంటాడుతూనే ఉంది. నాడు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల పోలీసు విభాగంలో పనిచేస్తున్న అధికారుల మధ్య చిచ్చు పెడుతోంది. శిక్షణ సమయంలో కలిసి మెలిసి ఉన్న వారు ఇప్పుడు శతృవుల్లా చూసుకునే పరిస్థితి తయారైంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ పోలీసుల పాలిట శాపాలుగా మారాయి. నక్సల్ ఏరివేతను క్రేజిగా చూపించిన ఉన్నతాధికారులు కొంతమంది రిటైర్ కాగా మరికొంతమంది పట్టించుకునే పరిస్థితుల్లో లేకుండా పోయారు. పాపం చేసిందొకరైతే శాపం మాత్రం వీరినే వెంటాడుతోంది. ఇంతకాలం అయ్యా మా గురించి పట్టించుకోండి అంటూ అధికారులను మాత్రమే కలిసిన వారి బాధ ఇప్పుడు రచ్చకెక్కి నెట్టింట వైరల్ గా మారింది. విధేయతతో కూడిన వినతుల వల్ల ప్రతిఫలాలు పొందలేకపోతున్నామన్న బాధతో పోలీసు అధికారులు ఇప్పుడు సోషల్ మీడియాను ఆశ్రయించాల్సి వచ్చింది. నిందితులను కోర్టుల్లో హాజరు పర్చాల్సిన పోలీసు అధికారులు ఇప్పుడు ప్రజా కోర్టులో తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

వరంగల్ జోన్ బాధ...

వరంగల్ జోన్ కు చెందిన 1996 బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారుల బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. అప్పుడు వరంగల్ జోన్ పరిధిలో వెళ్లాలనుకున్నా.. నక్సల్స్ ఏరివేత కోసం తమకు సకాలంలో పదోన్నతులు కల్పించకపోవడం శాపంగా పరిణమించిందని, దీనివల్ల ఆరేళ్లకు అందుకోవాల్సిన ''మూడు చుక్కల'' ముచ్చట 15 ఏళ్లకు అందుకున్నామని అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రేంజ్ కు చెందిన 1996 బ్యాచ్ ఎస్సైలు డీఎస్సీలు కాగా 1998 బ్యాచ్ వాళ్లు వరంగల్ జోన్ 1996 బ్యాచ్ వారి కంటే ముందే తమకే ముందు డీఎస్సీలుగా పదోన్నతి కల్పించాలని కోరుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఖమ్మం జిల్లాకు చెందిన తమ బ్యాచ్ అధికారులు ఉన్నతాధికారులను కల్సినప్పుడు సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయని సంతోషించాం కానీ నేటికీ ఆచరణలో మాత్రం పెట్టలేదని 1996 బ్యాచ్ పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ 1996 బ్యాచ్ పోలీసు అధికారుల పేరిట నెట్టింట వైరల్ అవుతోంది.

హైదరాబాద్ జోన్ బాధ ఇది...

1996 బ్యాచ్ వరకూ వరంగల్ జోన్ అధికారులు పడ్డ నరకయాతన ఇప్పుడు హైదరాబాద్ జోన్ పోలీసు అధికారులకు మొదలైంది. హైదరాబాద్ సిటీని ఫ్రీ జోన్ గా చేయడంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చాలామంది హైదరాబాద్ సిటీలో ఉద్యోగం పొంది చకచకా పదోన్నతులు పొందారు. అయితే 2009 బ్యాచ్ ఎస్సైలకు వచ్చే సరికి పదోన్నతుల ప్రక్రియకు బ్రేకు పడింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో కమిషనరేట్లను పెంచడంతో సీఐలుగా పదోన్నతులు హైదరాబాద్ మినహా తెలంగాణ అంతటా పదోన్నతుల ప్రక్రియ వేగవంతం అయింది. దీంతో వరంగల్ జోన్ కు చెందిన 2009, 2012 బ్యాచ్ ఎస్సైలు సీఐలుగా పదోన్నతి పొందారు. నేడో రేపో డీఎస్సీ పదోన్నతుల సీనియారిటీ జాబితాలో చేరిపోనున్నారు. అయితే హైదరాబాద్ జోన్ కు చెందిన 2009 బ్యాచ్ కు చెందిన ఎస్సైలు 200 మంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు. తమకంటే జూనియర్లయిన 2012 వరంగల్ జోన్ ఎస్సైలు సీఐలుగా విధులు నిర్వర్తిస్తుంటే తాము మాత్రం ఇంకా ఎస్సైలుగానే మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్ మెంట్ ను మూడేళ్లకు పెంచడంతో మరో ఏడు నుండి ఎనిమిదేళ్ల వరకూ తాము సీఐలు అయ్యే అవకాశం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రానున్న కాలంలో తమకంటే జూనియర్లు అయిన 2012 బ్యాచ్ వరంగల్ జోన్ అధికారులు డీఎస్పీలు అయినా తాము వారికి సబార్డినేట్ గా ఉండాల్సిన పరిస్థితి తయారు కానుందని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ జోన్ కు చెందిన 2009 బ్యాచ్ పోలీసు అధికారుల పేరిట ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్టు కొడుతోంది.

తప్పెవరిది...?

వరంగల్ జోన్ లో తీవ్రంగా ఉన్న నక్సల్స్ సమస్యను పరిష్కరించాలంటే ఎస్సై స్థాయి అధికారులే ఎక్కువగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీనివల్ల 1989 బ్యాచ్ నుండి ఎస్సైలకు పదోన్నతులు కల్పించలేదు. 1990 నుండి 1995 మధ్యన వరంగల్ జోన్ లో 56 సీఐ పోస్టులు ఉన్నప్పటికీ ఇందుకు సంబందించిన ప్రతిపాదనలు డీజీపీ కార్యాలయానికి పంపించలేదు. సీఐ స్థాయి అధికారులైతే నక్సల్స్ ఏరివేత కోసం ఫీల్డ్ లో పంపించే అవకాశం లేదని భావించే ప్రపోజల్స్ పంపించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక కాలంలో పదోన్నతుల ప్రక్రియను అమలు చేస్తే ఈ పరిస్థితి తయారయ్యేది కాదు. కానీ అప్పటి పాలకులు, ఉన్నతాదికారులు భవిష్యత్తులో ఏర్పడే ఈ అసమానత్వాన్ని గుర్తించకపోవడం వల్ల నేడు జూనియర్ బ్యాచ్ అధికారులు సుపిరియర్ ఆఫీసర్లుగా ఎదిగిపోయారు. హైదరాబాద్ వారికో న్యాయం తమకో న్యాయం అమలవుతోందని వరంగల్ జోన్ పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఈ సీన్ కాస్తా రివర్స్ గా మారింది. 2009 బ్యాచ్ కు చెందిన హైదరాబాద్ ఎస్సైలు సకాలంలో పదోన్నతులు పొందలేకపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కమిషనరేట్ తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ ను ఏర్పాటు చేయడంతో అక్కడి అధికారులు పదోన్నతులు సకాలంలో అందుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత కమిషనరేట్ల ఏర్పాటుపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో హైదరాబాద్ జోన్ లో పదోన్నతుల ప్రక్రియకు బ్రేకు పడింది. ఇక్కడ పోస్టులను క్రియేట్ చేసే పరిస్థితి లేకపోవడంతో పదోన్నతులు కల్పించలేకపోతున్నారని అంటున్నారు. 1989 నుండి 1996 వరంగల్ జోన్ ఎస్సైలు పదోన్నతుల కోసం దశాబ్దానికి పైగా ఎదురు చూసినట్టుగా 2009 బ్యాచ్ హైదరాబాద్ ఎస్సైలు ప్రమోషన్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి తయారైంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా బ్యాచ్ ల వారిగా ఏక కాలంలో పదోన్నతులు కల్పించే ప్రక్రియ కానీ ప్రత్యామ్నాయ మార్గాలు కానీ ఎంచుకుని రాష్ట్రంలోని పోలీసుల్లో నెలకొన్న అసమానత్వాన్ని నిలువరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


వరంగల్ జోన్ 1996 బ్యాచ్ పోలీసు అధికారుల పేరిట వైరల్ అవుతున్న పోస్టు

నమస్కారం సార్. మేము 1996 బ్యాచ్ లో SI లుగా వరంగల్ రేంజ్ లో (ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్) ఉద్యోగంలో చేరి, నక్సల్స్ సమస్యతో పోరాడి నేటి శాంతియుత పరిస్థితి కి అంకిత భావంతో పనిచేసినాము. చాలా మంది మా బ్యాచ్ మిత్రులు ప్రాణాలు కోల్పోయినారు. నక్సల్స్ సమస్య దృష్ట్యా మా సేవలను వినియోగించుకునే ఉద్దేశ్యంతో 6 సంవత్సరాలకే ఇవ్వ వలసిన సీఐ ప్రమోషన్ 15 సంవత్సరాలు నిండిన తర్వాత 2011 లో వచ్చినది. మా బ్యాచ్ కే చెందిన HYD రేంజ్ వాళ్ళు మా కంటే ముందే సీఐ లుగా ప్రమోషన్ పొంది ,(2) సంవత్సరాల క్రితమే DSPలు అయినారు. మా కంటే జూనియర్ లు అయిన 1998 బ్యాచ్ వారు కూడా మా కంటే ముందే సీఐ లుగా ప్రమోషన్ పొందినందున ,ఇప్పుడు కూడా మా కంటే ముందే DSP ప్రమోషన్ ఇవ్వాలని అంటున్నారు. DSP ర్యాంక్ అదికారి రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా పనిచేస్తారు అని మీకు తెలుసు. ఇప్పటికే మా బ్యాచ్ వారి కింద పని చేస్తున్నాము. ఇప్పుడు మా కంటే జూనియర్ ల కింద పనిచేసే పరిస్తితి ఏర్పడుతుంది. మేము వారి క్రింద పనిచేయడం వల్ల మా ఆత్మ గౌరవం దెబ్బతిని , విదుల నిర్వహణలో చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. గతంలో KMM జిల్లాలో ఉన్న 1996 బ్యాచ్ సీఐ లు తమరిని కలువగా... కొంత progress అనిపించింది. ఇప్పుడు మేము ప్రమోషన్ లేక పోస్టింగ్స్ లేక భరించలేని భాదతో ఉన్నాము. వరంగల్ రేంజ్ లో సెలెక్ట్ కావడము లేదా వరంగల్ రేంజ్ లో పుట్టడమే మా నేరం అనే భావనతో మేము కుమిలి పోతూ ఉన్నాము సర్. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని అసెంబ్లీ దృష్టికి లేదా గౌరవ కెసిఆర్,కేటీఆర్,కవిత మేడం గార్ల దృష్టికి తీసుకెళ్లి మాకు ప్రమోషన్ వచ్చే విధముగా చూస్తారని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము సార్. మేము మీ పిల్లలము ,మీ బిడ్డలము.వరంగల్ జోన్లో నక్సలైట్లతో పోరాడి ప్రాణాలు అర్పించి సేవలు చేసిన బ్యాచ్ సార్ మాది. మాకు న్యాయం చేయండి సర్. ఎంతో మనోవేదనతో తమరికి వేడుకుంటున్నాము సార్. ఇట్లు

తమ విధేయులు

1996 బ్యాచ్ సీఐ లు

వరంగల్ రేంజ్

=========================

హైదరాబాద్ 2009 బ్యాచ్ ఎస్సైల ఆవేదన ఇది....

మేము అనగా 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ తమరికి నమస్కరించి ఎంతో ఆశతో వ్రాయునది ఏమనగా! మేము 2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ రేంజ్ కింద 432 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ గా సెలెక్ట్ అయ్యి నేటికీ 11 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నాము. ఇప్పటివరకు మా 2009 సబ్ ఇన్స్పెక్టర్స్ బ్యాచ్ యందు 211 మంది పదోన్నతులు పొందినారు. ఇంకనూ 200 మంది పదోన్నతులు పొందాల్సి ఉన్నది. మా బ్యాచ్ నందు ప్రమోషన్ పొందిన వారు మూడు సంవత్సరాలు తమ సర్వీస్ పూర్తి చేసినారు. అదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా బ్యాచ్ వారు మొత్తం సబ్ ఇన్స్పెక్టర్స్ లు అందరూ పదోన్నతులు పొంది 4 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసినారు. వరంగల్ రేంజ్ నందు పని చేస్తున్న, మాకంటే జూనియర్ బ్యాచ్ అయినా 2012 సబ్ ఇన్స్పెక్టర్స్ బ్యాచ్ వాళ్లు, ఈ ప్యానల్ సంవత్సరం 2020-2021 లో 40 పదోన్నతులు పొందినారు మేము సీనియర్ బ్యాచ్ అయినా కూడా వారి కింద జూనియర్లుగా గుర్తించబడతాము. అంతే కాకుండా రాబోయే కాలంలో పొందే పదోన్నతులలో కూడా వారే ముందుగా పదోన్నతులు పొంది అవకాశం ఉన్నది . మా సీనియారిటీని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇట్టి వివాదం మా 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ హైదరాబాద్ రేంజ్ మరియు 2012 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ వరంగల్ రేంజ్ మధ్య వివాదం తలెత్తే అవకాశం ఉన్నది.

ఇప్పటికీ మా 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ లలో కొంతమంది పదోన్నతులు పొందిన వారికి మరియు పొందని వారికి మధ్య మూడు సంవత్సరాల వ్యత్యాసం ఏర్పడినది. ఈ మధ్య కాలం లో ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 59సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకొని జీవో నెంబర్.45 జారీ చేసినది. కావున రాబోయే మూడు సంవత్సరాల వరకు పదవీ విరమణలు ఉండవు. కావున ఈ ప్యానల్ ఇయర్లో మాకు పదోన్నతులు రాకపోతే రాబోయే మూడు సంవత్సరాల వరకు మాకు పదోన్నతులు ఉండవు. ఇప్పటికే మా బ్యాచ్ లో కొంత మంది ఇన్స్పెక్టర్స్ గా పదోన్నతులు పొంది మూడు సంవత్సరాలు దాటిపోయింది. మా మొత్తం బ్యాచ్ పదోన్నతి పొందేందుకు ఇంకా ఐదు నుండి ఏడు సంవత్సరాల సమయం పడుతుంది. ఇట్టి విషయంలో వెంటనే రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నతాధికారులతో చర్చించి మా 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కు, 1. సూపర్ న్యూమరీ ద్వారా ఏర్పడిన ఖాళీలను 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టరస్ కు పదోన్నతులు కల్పించి వారి స్థానాలను భర్తీ చేయడం. 2. సప్రస్ పోస్టులు విడుదల చేసి 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ పదోన్నతులు కల్పించాలి. 3. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ల లో అన్ని పోలీసుస్టేషన్ లను అప్ గ్రేడ్ చేయాలి. దాని ద్వారా కొన్ని ఇన్స్పెక్టర్ పోస్టులు ఏర్పడే అవకాశం ఉంది. ఇట్టి ఏర్పడ్డ ఇన్స్పెక్టర్స్ 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ లకు, ఇన్స్పెక్టర్స్ గా హోదా కల్పించి వారి ఖాళీలు భర్తీ చేయాలి. 4. తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రాధాన్యత గల పోలీసు స్టేషన్లను SHO లుగా సబ్ ఇన్స్పెక్టర్స్ నుండి ఇన్స్పెక్టర్ గా మార్చడం ద్వారా ఇన్స్పెక్టర్స్ వేకెన్సీ ఏర్పడుతుంది. ఇట్టి వేకెన్సీ లను 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ లకు ఇన్స్పెక్టర్గా పదోన్నతి కల్పించాలి. తద్వారా నేర నియంత్రణ, పరిపాలన సౌలభ్యం జరుగుతుంది . అంతే కాకుండా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం కలుగుతుంది. 5. మెట్రో రైల్ లోని 144 పోస్టులను 2009 సబ్ ఇన్స్పెక్టర్ స్ లకు పదోన్నతి ఇచ్చి వారి ద్వారా భర్తీ చేసి నేరాలు నియంత్రించి సురక్షిత హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దాలి. 6. లూప్ లైన్ లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి ఈ ప్యానల్ ఇయర్ లో మాకు పదోన్నతులు రాకపోతే రాబోయే మూడు సంవత్సరాలకు మాకు ఒక్క పదోన్నతి వచ్చే అవకాశం లేదు. తమరు మా యొక్క విన్నపాన్ని మన్నించి మా 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ గా మిగిలిన 200మంది కి ఇన్స్పెక్టర్స్ గా పదోన్నతి కల్పిస్తారని కోటి ఆశలతో మా విన్నపాలను తెలియజేస్తున్నాము.

జై తెలంగాణ...

ఇట్లు

తమ ఆశీస్సులు కోరే

2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ప్

Next Story

Most Viewed