కాలుష్యం నీడలో వెలుస్తున్న ప్రగతి వెంచర్ ?

by Disha Web Desk 20 |
కాలుష్యం నీడలో వెలుస్తున్న ప్రగతి వెంచర్ ?
X

దిశ, ముస్తాబాద్ : మండలంలో నూతనంగా వెలుస్తున్న ప్రగతి వెంచర్ డీటీసీపీ అనుమతులతో అన్నిహంగులతో ఏర్పాటు అవుతుందని అధికారులు, అటు వెంచర్ నిర్వాహకులు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కొనుగోలు దారుల ఆరోగ్యంపట్ల వెంచర్ నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. నూతనంగా ఏర్పడే వెంచర్ గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దీటి నరసింహులు మాట్లాడుతూ రైస్ మిల్ పక్కనే వెంచర్ వెలుస్తుండటంతో ఇందులో ప్లాట్లు కొన్నవారికి భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. రియల్టర్లు కొందరు ఇదే అదును చూసుకొని పక్క జిల్లాల నుండి వచ్చి పంట పొలాలను, గుట్టలను సైతం చౌక ధరకు విక్రయిస్తూ వాటిని వెంచర్ లుగా మారుస్తున్నారన్నారు. ముస్తాబాద్ - కామారెడ్డి రోడ్డుని ఆనుకొని నామపూర్ సమీపంలో దాదాపుగా 19 ఎకరాల్లో ప్రగతి వెంచర్ ని నిర్వాహకులు హంగు ఆర్భాటాలకు పోయి అభివృద్ధి చేస్తున్నారని ఆరోపించాడు.

మొర్రాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ వెంచర్ పక్కనే రైస్ మిల్ ఉందని, అనుమతులు ఇచ్చిన అధికారులకు ఇది కనిపించట్లేదా ? అని ప్రశ్నించాడు. రైస్ మిల్ పొగ గొట్టం నుండి విడుదల అయ్యే కాలుష్యం, ఊక వల్ల రోగాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్ లో ఇక్కడ ప్లాట్లు కొన్న వారు ఇల్లు నిర్మించుకుంటే అనారోగ్యం బారిన పడటం ఖాయమని అన్నాడు. కార్యదర్శికి ఈ సమస్యలు కనిపించలేదా అని ప్రశ్నించాడు. వెంచర్ కి అనువైన స్థలం ఇది కాదని ఆరోపించాడు. పూర్తి స్థాయిలో మరోసారి ఈ వెంచర్ లో అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరాడు. అమాయక ప్రజలను మోసం చేసే క్రమంలోనే రియల్టర్లు సులువైన పద్ధతిని ఎంచుకున్నారని వెంచర్లు వేసుకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, ప్రజలు ప్లాట్లు కొనేటప్పుడు అవగాహనతో ప్లాటు విక్రయం చేయాలని లేదంటే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య ఇబ్బందులకు గురవుతారని అన్నాడు. ఇలాంటి వెంచర్ లు ఎక్కడున్నా సరే ప్లాట్లు కొనే ముందు కొనుగోలు దారులు ముందస్తు ఆలోచనలు చేయాలని ప్రజలను కోరాడు. సంబంధిత అధికారులకు రియల్టర్లకు మధ్య ఏమైనా ఒప్పందాలు జరిగి ఉంటాయని అందుకే అనుమతులు వచ్చి ఉంటాయని సందేహం వ్యక్తం చేశాడు.



Next Story

Most Viewed