జగిత్యాలలో పాలి‌ట్రిక్స్ షురూ.. ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు

by srinivas |
జగిత్యాలలో పాలి‌ట్రిక్స్ షురూ.. ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు
X
  • మొదలైన ఎన్నికల సందడి
  • పల్లెనిద్ర పేరుతో ప్రజల్లోకి ఎమ్మెల్యే సంజయ్
  • ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్ట్రాటజీ
  • నిత్యం ప్రజాక్షేత్రంలోనే బీజేపీ ఆశావహులు
  • ఆసక్తికరంగా మారిన రాజకీయం

జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. స్ట్రాటజీలు ఏవైనా లక్ష్యం మాత్రం ఎమ్మెల్యే పదవి అన్నట్లుగా ప్రచారం సైతం మొదలుపెట్టారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, అశుభకార్యాలు, పలకరింపుల పేరుతో వీలైనంత సమయం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలవాలని సంజయ్ కుమార్ ఉవ్విళ్లూరుతుంటే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అన్నట్లుగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భావిస్తున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి కొంత అనుకూల వాతావరణం ఏర్పడినప్పటికీ జగిత్యాలలో మాత్రం ఆశావాహులు ఎక్కువగా ఉండడం ఆ పార్టీని వేధిస్తోంది. బీజేపీ తరఫున అభ్యర్థి ఎవరైనా సమిష్టిగా కృషి చేసి బోణి కొట్టాలని లక్ష్యంగా ఆ పార్టీ క్యాడర్ పనిచేస్తుంది. ఇలా మూడు పార్టీల నాయకులు వారి వ్యూహాలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఆయా పార్టీల నాయకుల రాకపోకలతో గ్రామాల్లో సందడి నెలకొంటుండగా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. స్ట్రాటజీలు ఏవైనా లక్ష్యం మాత్రం ఎమ్మెల్యే పదవి అన్నట్లుగా ప్రచారం సైతం మొదలుపెట్టారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, అశుభకార్యాలు, పలకరింపుల పేరుతో వీలైనంత సమయం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలవాలని సంజయ్ కుమార్ ఉవ్విళ్లూరుతుంటే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అన్నట్లుగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భావిస్తున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి కొంత అనుకూల వాతావరణం ఏర్పడినప్పటికీ జగిత్యాలలో మాత్రం ఆశావాహులు ఎక్కువగా ఉండడం ఆ పార్టీని వేధిస్తోంది. బీజేపీ తరఫున అభ్యర్థి ఎవరైనా సమిష్టిగా కృషి చేసి బోణి కొట్టాలని లక్ష్యంగా ఆ పార్టీ క్యాడర్ పనిచేస్తుంది. ఇలా మూడు పార్టీల నాయకులు వారి వ్యూహాలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు.

పల్లె నిద్రతో ప్రజల మధ్యకు ఎమ్మెల్యే..

సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వినూత్న రీతిలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఉదయం సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటూనే ఫంక్షన్లు, పరామర్శలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలో లేని విధంగా పల్లెనిద్ర పేరుతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలోని మండలంలో ఏదో ఒక ఊరిలో రాత్రి బస చేస్తున్నారు. మర్నాడు ఉదయం స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఆయుధంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి అయిన జీవన్ రెడ్డిపై 60వేల ఓట్ల పైగా మెజారిటీతో గెలుపొందిన డాక్టర్ సంజయ్ కుమార్ ఈసారి కూడా పైచేయి సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి తనను గట్టెక్కిస్తాయని ఎమ్మెల్యే భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ అంశంతోపాటు జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి విషయంలో ఎమ్మెల్యే ప్రజల నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.

వైఫల్యాలే లక్ష్యంగా జీవన్ రెడ్డి...

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలవాలని పట్టుదలతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఘోర ఓటమి పాలైనప్పటికీ మరునాటి నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఆ తరువాత వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్సీగా గెలుపొంది కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపారు. ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా పావులు కదుపుతూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మాస్టర్ ప్లాన్ అంశంలో ప్రభావిత గ్రామాల ప్రజలకు అండగా నిలిచి వ్యతిరేకించారు. ఎరువులు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఉన్న ఇబ్బందులను లేవనెత్తుతూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ రైతుల మద్దతు చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సమస్యలే ఎజెండాగా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్స్ సమస్యలకన్నా స్థానికంగా ఉన్న వాటికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శలపాలయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయన పరిధి విశాలం అయినప్పటికీ కేవలం జగిత్యాలకు మాత్రమే పరిమితం అయ్యారని గ్రాడ్యుయేట్స్‌లో కొంత అసంతృప్తి నెలకొన్నది.

నిత్యం ప్రజల్లోనే బీజేపీ ఆశావాహులు...

అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో పెద్దగా కన్ఫ్యూజన్ లేకపోయినా బీజేపీ పార్టీలో మాత్రం ఆశావాహులు ఎక్కువయ్యారు. జగిత్యాల అభ్యర్థి విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు నాయకుడిగా గుర్తింపు పొందిన పన్నాల తిరుపతిరెడ్డిని, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ భోగ శ్రావణిని పార్టీలోకి తీసుకురావడానికి ఎంపీ అరవింద్ ప్రత్యేక చొరవ చూపించారు. వీరిలో భోగ శ్రావణికి గుర్తింపునిచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నియమించింది. ఆమె కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న శైలేందర్ రెడ్డితోపాటు పోయినసారి పోటీ చేసిన రవీందర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేకపోయినా ఈ నలుగురు నాయకులు నియోజకవర్గంలో కలియ తిరుగుతూ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సందర్భం వచ్చినప్పుడల్లా కౌంటర్స్ ఇస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జగిత్యాలలో ఉన్న భిన్న పరిస్థితులు ఆ పార్టీకి నష్టం కలిగిస్తాయని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా కలిసికట్టుగా పనిచేసి బోణి కొట్టాలని బీజేపీ క్యాడర్ భావిస్తోంది.

Next Story