ప్రజల సమస్యలే బీఆర్ఎస్ ఎజెండా : కేటీఆర్

by Disha Web Desk 23 |
ప్రజల సమస్యలే బీఆర్ఎస్ ఎజెండా : కేటీఆర్
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రజల సమస్యలే ఎజెండాగా, కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడుదామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ లో సోమవారం సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి సమావేశంలో పాల్గొని పార్లమెంటు ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చాలా స్థానాల్లో స్వల్ప మెజార్టీ తేడాలో కాంగ్రెస్ విజయం సాధించిందని, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్సు తీసేస్తాం అంటున్నరని, కాంగ్రెస్ మోసపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు.

ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ కు చేసిందేమీ లేదని, ఒక్క రూపాయి పని చేయని బండి సంజయ్ కు ఓట్లు అడిగే అర్హత లేదని, మోడీ పదేండ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయని గుర్తు చేశారు. తెలంగాణకు ఏమి చేయని బీజేపీ కి, కరీంనగర్ కు నయాపైసా పని చేయని బండి సంజయ్ కు ఓటు ఎందుకు వేయాలో ప్రజల్లో చర్చ పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో 8 నుంచి 10స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయని, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు వలన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 10న కేసీఆర్ రోడ్ షో సిరిసిల్లలో ఉంటుందని, ప్రతి కార్యకర్త తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లబ్ధి పొందిన నాయకులు పార్టీని వీడి వెళ్తున్నారని, కష్ట కాలంలో తన వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని, భవిష్యత్తు లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కష్టపడుతునని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని, కాంగ్రెస్ లో చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దని అందరికీ అండగా ఉంటానని ఈ సందర్భంగా కేటీఆర్ కార్యకర్తలకు భరోసానిచ్చారు.



Next Story

Most Viewed