పెండింగ్ ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : సీసీఎల్ఏ కమిషనర్

by Aamani |
పెండింగ్ ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి :  సీసీఎల్ఏ కమిషనర్
X

దిశ,పెద్దపల్లి : పెండింగ్ ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మెదక్, సిద్దిపేట జిల్లా కలెక్టర్లతో పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 1.38 లక్షల పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించామని అన్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మరోసారి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, తహసిల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారి, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే భూ సంబంధిత సమస్యలను సైతం కలెక్టర్లకు బదిలీ చేయడం జరుగుతుందని, వీటిని అత్యంత ప్రాధాన్యతతో సత్వర పరిష్కారం జరిగేలా చూడాలని సీసీఎల్ఏ కమిషనర్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో అదనపు కలెక్టర్,రెవెన్యూ డివిజన్ అధికారుల, తహసిల్దార్ల స్థాయిలలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి వచ్చే గురువారం నాటికి పరిష్కరిస్తామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ ఏర్పాటుకు భవనం గుర్తించామని, అదేవిధంగా పెద్దపల్లిలో సబ్ రిజిస్టర్ కార్యాలయ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న పంచాయతీ భవనాన్ని కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ డివిజన్ అధికారులు హనుమా నాయక్, తహసిల్దార్లు, కలెక్టరేట్ ఏ.ఓ. శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story