ఉపాధ్యాయుల కోసం కలెక్టరేట్ బాట పట్టిన తల్లిదండ్రులు..

by Sumithra |
ఉపాధ్యాయుల కోసం కలెక్టరేట్ బాట పట్టిన తల్లిదండ్రులు..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పాఠశాలకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టరేట్ బాట పట్టిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు రాజీవ్ నగర్ కు చెందిన జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని పెద్దయెత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.

జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులను కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 29 ఏండ్లుగా పాఠశాల ఉందని, పాఠశాలలో 340 మంది విద్యార్థులు ఉండగా కేవలం 5 గురు ఉపాధ్యాయులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు వినతులు ఇచ్చినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి హై స్కూల్ కు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు.Next Story

Most Viewed