వలసవాదులతో అభివృద్ధికి ఆటంకం : కొప్పుల ఈశ్వర్

by Disha Web Desk 23 |
వలసవాదులతో అభివృద్ధికి ఆటంకం : కొప్పుల ఈశ్వర్
X

దిశ, పెద్దపల్లి ప్రతినిధి: వలసవాదులతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, అలాంటి వారికి ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేసిందన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచిందని విమర్శించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త మండలాలు, నియోజకవర్గాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

అలాగే ఎన్నికల సమయంలో ప్రజలను ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఇదిలా ఉంటే నష్టపోయిన రైతులను పెద్దపల్లి ఎమ్మెల్యే ఒక్కసారి అయిన కలసి వారికీ మద్దతు తెలిపారా.. ఎండిపోయిన పంటలను పరిశీలించారా అని కొప్పుల ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని వర్గాలకు అభివృద్ధి చేసారని అన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని ప్రజలకు కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దాసరి ఉష తో పాటు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed