పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.. కాంగ్రెస్ బీఆర్ఎస్‌తో కలిసి వస్తుంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Disha Web Desk 13 |
పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.. కాంగ్రెస్ బీఆర్ఎస్‌తో కలిసి వస్తుంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: డొమెస్టిక్ సిలిండర్ పై కేంద్ర ప్రభుత్వం మోపిన అదనపు భారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌తో కలిసి వస్తుందని సవాల్ విసిరారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. గృహ వినియోగ సిలిండర్లపై 50 రూపాయల అదనపు భారాన్ని మోపడమే సుపరిపాలననా అని ప్రశ్నించారు.

నాడు యూపీఏ హయాంలో డొమెస్టిక్ సిలిండర్లపై 50 రూపాయలు పెంచితే ప్రజలపై భారం పడకుండా ఉండాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పెంచిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్లను అందిస్తుందని కావాలంటే అక్కడికి వెళ్లి పరిశీలించాలని హితవు పలికారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గతంలో ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారిని అర్హులుగా గుర్తించి నేడు వారిని అనర్హుల జాబితాలో చేర్చడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

మరోవైపు 2014లో ఐదు లక్షలగా ఉన్న ఇంటి నిర్మాణ వ్యయాన్ని ప్రస్తుతం 3 లక్షలకు కుదించారని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గతంలో గుర్తించిన 4537 మందిని ప్రస్తుత జాబితాలో పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో నిరుపేదలకు ఇళ్లు నిర్మించి అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిని విస్మరించారన్నారు.

ఇల్లు తక్కువగా ఉన్నాయని కారణంతో అర్హుల జాబితాను కుదించడం సరికాదు అన్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నప్పటికీ వారికి నిలువ నీడ కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. నాలుగేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదని అలాంటప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తుకు రేషన్ కార్డును ముడి పెట్టడం సరికాదని తెలిపారు. కళ్యాణ లక్ష్మి సర్టిఫికెట్ తో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రకు అనుబంధంగా జగిత్యాల పట్టణంలో శుక్రవారం ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తోపాటు, కాంగ్రెస్ పాలన లో చేపట్టిన పథకాలు వివరిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గిరి నాగ భూషణం, పిసిసి ఆర్గనైజేషన్ సెక్రటరీ బండ శంకర్,జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed