మిషన్ భగీరథ.. అస్తవ్యస్తం

by Disha Web Desk 12 |
మిషన్ భగీరథ.. అస్తవ్యస్తం
X

దిశ, మంథని : మంథని మండలంలో మిషన్ భగీరథ పథకం అస్తవ్యస్తంగా మారింది. ఏళ్లు గడిచినా గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరి వల్ల అసంపూర్తి పనులతో ఇంటింటికీ తాగునీరు కాగితాలకే పరిమితమైంది. మండలంలో 32 గ్రామపంచాయతీలు, మంథని మున్సిపాలిటీతో కలిపి 16,374 గృహాలకు 176.03 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి నల్ల కనెక్షన్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. మంథని తమ్మచెరువుతో పాటు పలు వీధుల్లో పైప్ లైన్ పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. మండలంలోని పలు పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.

తాగునీరు రాక ఇబ్బందులు..

మండలంలోని మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. మైదుపల్లిలో రెండు ట్యాంకులు ఉన్నాయి. కానీ ఒక ట్యాంక్‌కు మాత్రమే మిషన్ భగీరథ నీరు అప్పుడప్పుడు వస్తోంది. మరో ట్యాంక్‌లోకి స్థానికంగా ఉన్న బోరు నుంచి నీటిని ఎక్కిస్తున్నారు. దీంతో గోదావరి ద్వారా అందే తాగునీరు కలగానే మిగిలింది. అడవిసోమన్‌పల్లి గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా నామాత్రంగానే మారింది. స్థానికంగా ఉన్న బోర్ నుంచే రెండు ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. వెంకటాపూర్ క్రాస్ నుంచి బూస్టింగ్ మోటార్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా సోమనపల్లికి సక్రమంగా అందడం లేదు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఏ గ్రామంలోనూ మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరా కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పనులన్నీ అస్తవ్యస్తం..

గ్రామాల్లో పైపులు వేసేందుకు తవ్విన కందకాలు సక్రమంగా పూడ్చక పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. మరోవైపు సీసీ రోడ్లు తవ్విన చోట మళ్లీ కాంక్రీట్ సక్రమంగా వేయలేదని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పట్టణంలోని తుమ్మ చెరువు ప్రాంతంలో పైప్ లైన్ కోసం సీసీ రోడ్డు తవ్వి రోజుల తరబడి అలాగే వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల ముందు కంకర రాళ్లు ప్రమాదకరంగా మారాయి. అలాగే పైపులను నిర్మాణంలోనూ నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలారనే పలువురు ఆరోపిస్తున్నారు. మూడు అడుగుల లోతున పైప్ లైన్ వేయాల్సి ఉన్నా మంథని తో పాటు పలు గ్రామాల్లో అడుగున్నర, రెండడుగుల లోతులోనే పైపులు వేశారు.

దీంతో వాహనాల రాకపోకల సమయంలో ఒత్తిడికి పైపులు పగిలిపోయే అవకాశం ఉంది. నల్లాలు బిగించకపోవడంతో నీరు వృథా అవుతుంది. మిషన్ భగీరథ కింద ఇచ్చిన నల్లా కనెక్షన్లకు గుత్తేదారు నల్లాలు బిగించాల్సి ఉంది. కానీ, ఇది పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. మంథని పట్టణంతోపాటు పలు గ్రామాల్లో నల్లాలకు బిరడాలు లేక తాగునీరు వృథాగా పోతున్న పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే నెల రోజుల్లో మిగిలి ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.

Next Story

Most Viewed