వైద్యమో.. రామచంద్రా..!

by Disha Web Desk 1 |

మంథని సివిల్ ఆసుపత్రిలో వైద్యం కోసం రోగుల నిరీక్షణ

సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది

దిశ, మంథని : మంథని సివిల్ ఆసుపత్రిలో పరిస్థితి మిరింత దయనీయంగా మారింది. అక్కడ పని చేసే వైద్యులు, సిబ్బంది ఏమాత్రం సమయ పాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వైద్య సేవల కోసం వివిధ గ్రామల నుంచి వ్యయ ప్రాయాసలు ఓర్చి వచ్చిన రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలకు విధులకు హాజరు కావలసిన వైద్యులు, సిబ్బంది సోమవారం సమయపాలన లేకుండా విధులకు హాజరయ్యారు.

వివిధ గ్రామాలకు చెందిన చెందిన రోగులు 8:30 గంటలకే ఆసుపత్రి వద్దకు వచ్చి సేవల కోసం నిరీక్షించారు. ఉదయం 9.15 గంటల వరకు ఏ ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో లేడు. గంటల తరబడి లైన్ లో నిలబడి ఓపిక నశించిన రోగులు వైద్యులు ఇంకెప్పుడొస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రోగులకు ఓపీ రాసే వారు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. అనంతరం అక్కడే శిక్షణలో ఉన్న ట్రైనీ ఏఎన్ఎం సౌజన్య రోగులకు ఓపీ చిట్టిలు అందజేశారు. ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యుడు రాజస్వామి 9.15 కు విధులకు హాజరయ్యారు.

అనంతరం 9.45 వరకు ఐపీ వార్డుల్లోని రోగులకు వైద్య సేవలు అందించారు. తిరిగి ఆయన ఓపీ వార్డుకు వచ్చేసరికి పదుల సంఖ్యలో రోగులు వేచి ఉన్నారు. అదేవిధంగా 9గంటలకు విధులకు హాజరు కావాల్సిన మరో వైద్యడు రామకృష్ణారావు 9.50కి విధులకు హాజరయ్యారు. కేవలం అరగంట వ్యవధిలోనే ఇద్దరు వైద్యులు హడావిడిగా సుమారు 50 మంది రోగులకు వైద్య పరీక్షలు అందించడం గమనార్హం. మరోవైపు ప్రమాదంలో గాయపడి వచ్చిన రోగులు ఎక్స్ రే సౌకర్యం లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.

సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సివిల్ ఆస్పత్రిలో 11 మంది వైద్యులకు కేవలం ఆరుగురు మాత్రమే విధులకు హాజరయ్యారు. మొత్తం నాలుగు మండలాల నుంచి రోజు 150- 200 మంది రోగులు రోజు వైద్య సేవల నిమిత్తం వస్తున్నారు. ముఖ్యంగా గోదావరి ఖని ప్రభుత్వాసుపత్రిలో పని చేసే వైద్యుడికి మంథని సివిల్ ఆసుపత్రి ఇన్ చార్జి బాధ్యతలు అప్పజెప్పడంతోనే పర్యవేక్షణ లోపించింది సమాచారం. సోమవారం ఆరుగురు వైద్యుల్లో ఇద్దరు సెలవులో ఉండగా, ఒకరు మాతా శిశు సంరక్షణ కేంద్రానికి వెళ్లారు. మరో వైద్యుడు విధులకు గైర్హాజరు కాగా, ఇద్దరు మాత్రమే విధులకు హాజరయ్యారు. ఫార్మసిస్ట్, మరో ఉద్యోగి కూడా విధులకు హాజరు కాలేదు.



Next Story

Most Viewed