దేశంలోనే కేసీఆర్ నంబర్ -1 అవినీతి పరుడు : అమిత్ షా

by Aamani |   ( Updated:2023-11-20 13:46:42.0  )
దేశంలోనే కేసీఆర్ నంబర్ -1  అవినీతి పరుడు : అమిత్ షా
X

దిశ,జనగామ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అత్యంత నంబర్ -1 అవినీతిపరుడని, రాష్ట్రంలో 2జీ (కెసిఆర్, కేటీఆర్), 3జీ ఓవైసీ తరాల పాలన సాగుతుందని బిజెపి జాతీయ నాయకులు,కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్ మైదానంలో బీజేపీ నిర్వహించిన సకల జనుల సంకల్ప సభ కు ఆయన హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే నెంబర్ -1 అవినీతిపరుడని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై విచారణ చేపడతామని సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ రెండు తరాల (2జీ) పాలన, అదే విధంగా ఓవైసీ (3జీ) మూడు తరాల పాలన సాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీది 4జీ ( నెహ్రూ, ఇందిర, రాజీవ్, రాహుల్) పాలన అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్,ఎంఐఎం అధినేత ఓవైసీకి భయపడి, హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. బైరాన్ పల్లి లో అమరుల స్మారకం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో తాము అధికారంలోకొస్తే కెసిఆర్ అవినీతిపై విచారణ చేపట్టడంతో పాటు, సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ను రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి కిసాన్ యోజనకు సంబంధించి పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం వస్తే పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా నిరుపేదలకు వైద్యం బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే స్వీకరిస్తుందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నామంటే నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. జనవరి 22న ప్రధాని మోదీ రామ మందిరాన్ని ప్రారంభిస్తారని, ప్రజలందరికీ ఉచిత దర్శనం కల్పిస్తామని, 2024 లో మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలని అన్నారు.

ఇందుకోసం బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. జనగామ ఎమ్మెల్యే కబ్జా కోరుడు అని విమర్శించారు, ఆ పార్టీ నాయకులు కూడా కబ్జా కోరులే అని స్పష్టం చేశారు. జిల్లాలోని జనగామ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంత రెడ్డి, స్టేషన్గన్పూర్ బిజెపి అభ్యర్థి డాక్టర్. గుండె విజయరామారావు, పాలకుర్తి అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డిలను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు కేవీఎల్ఎన్.రెడ్డి,సౌడ రమేష్,మహంకాళి హరిచంద్ర గుప్తా,శివరాజ్ యాదవ్,పవన్ శర్మ, సంపత్ కుమార్,రమేష్, అనిల్ తదితరులు పాల్గొనగా సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

Advertisement

Next Story