గంగులను ఓడించేందుకు సొంత నేతలే యత్నిస్తున్నారు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
గంగులను ఓడించేందుకు సొంత నేతలే యత్నిస్తున్నారు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, కరీంనగర్: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లోనూ సర్కార్ వ్యతిరేక ఓట్లను చీల్చే కుట్ర జరుగుతోందన్నారు. కరీంనగర్ ప్రజలెవరూ మోసపోవద్దని, బీఆర్ఎస్ పాలనలో భూకబ్జాలు, డ్రగ్స్, కమీషన్ల దందాతో కరీంనగర్ అల్లాడుతున్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీల్లోని పేదవర్గాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని బండి సంజయ్ పేర్కొన్నారు.


పాదయాత్రలో భాగంగా కరీంనగర్ పాతబజార్ శివాలయం నుంచి కాపువాడ, మంగలివాడ, మారుతినగర్‌లో బండి సంజయ్ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నా. వాతావరణం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉంది. బీఆర్ఎస్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో. అంతకంటే రెట్టింపు వ్యతిరేకత కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్ధి పట్ల ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే అమ్ముడుపోతారు. కేసీఆరే స్వయంగా పైసలిచ్చి కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోవడం ఖాయమని తేలిపోయింది. ప్రజలు దయచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చవద్దని కోరుతున్నా. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న బీజేపీకి ఓటేసి అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నా.’ అని బండి సంజయ్ సూచించారు.


‘బీజేపీ అధికారంలోకి వస్తే బలహీనవర్గాల్లోని పేద వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. పేద సామాజికవర్గానికి చెందిన నరేం ద్రమోదీ ప్రధాని అయ్యారు. తెలంగాణలో బీసీ పేద వ్యక్తి సీఎం అవుతారు. మోదీ బీసీ ఆత్మగౌరవ సభకు వచ్చి పేదల పక్షాన నిలిచారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే పేదల అభ్యున్నతే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బీసీ వ్యతిరేక డీఎన్ఏ ఉంది. కేసీఆర్ సర్కార్‌లో బీసీల్లో ముగ్గురికి మాత్రమే మంత్రులుగా అవకాశం కల్పించారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులిచ్చారు. కేసీఆర్‌కు ఏ మాత్రం దళిత, బడుగు, బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించాలి. కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నా సవాల్‌ను స్వీకరించాలి. మోదీ ప్రభుత్వం తెలంగాణ‌కు కేటాయించిన నిధులను బీఆర్ఎస్ దారి మళ్లిస్తోంది. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరుతున్నా. ఈడీ, సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీకి సంబంధం లేదు. తప్పు చేసినట్లు ఆధారాలుంటే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాయి. నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతిపరులను ఉపేక్షించబోదు.’ అని బండి సంజయ్ హెచ్చరించారు.

‘గంగుల... ముందు మీ స్థానమేందో తెలుసుకో...మీకు చివరిదాకా బి.ఫాం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. గంగులను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే యత్నిస్తున్నారు. కరీంనగర్ ప్రజలారా... ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి గెలవాలని బీఆర్ఎస్ చూస్తోంది. డబ్బులను వెదజల్లుతోంది. బీఆర్ఎస్ నేతల అరాచకాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. భూకబ్జాలు, డ్రగ్స్, గంజాయి, కమీషన్ల దందాతో కరీంనగర్‌ను సర్వనాశనం చేశారు. కరీంనగర్‌ను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రజలంతా బీజేపీకి మద్దతిచ్చి గెలిపించాలి.’ అని బండి సంజయ్ కోరారు.



Next Story

Most Viewed