పంటలు వేయకుండా ఆంక్షలు విధించిన చరిత్ర కేసీఆర్‌దే: గంగాడి కృష్ణారెడ్డి ఫైర్

by Disha Web Desk 19 |
పంటలు వేయకుండా ఆంక్షలు విధించిన చరిత్ర కేసీఆర్‌దే: గంగాడి కృష్ణారెడ్డి ఫైర్
X

దిశ, కరీంనగర్ టౌన్: కిసాన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం.. గత ఎన్నికల సమయంలో తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ ఎందుకు చేయడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ వెంటనే చేయాలని, ధరణి, భూసమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్లోని కలెక్టరేట్ వద్ద భారీ నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ వర్తింపజేయకపోవడంతో రైతులు బ్యాంకులలో అధిక వడ్డీలు చెల్లిస్తూ అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని, పంటలు వేయకూడదని ఆంక్షలు విధించిన చరిత్ర కేసీఆర్‌దే అని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోలేని, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం తెలంగాణలో రాజ్యమేలుతుందన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు శ్రేయస్సు అభివృద్ధి కోసం.. రైతును రాజు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. ఆ దిశలోనే ఒక ఎకరం పొలానికి 94% సబ్సిడీతో వివిధ రకాల ఎరువులు అందిస్తుందని చెప్పారు. కానీ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి రైతుబంధు ఒక్కటే సర్వరోగనివారిణీలా భావిస్తూ గొప్పలు చెప్పుకోవడం మూర్ఖత్వం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఒక్క రూపాయి అధికంగానైనా బీఆర్‌ఎస్ ప్రభుత్వం బోనస్ ప్రకటించి రైతులను ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. తాలు, తరుగు పేరిట కోతలు విధిస్తూ రైతులను ఆర్థికంగా నష్టపరిచే సంస్కృతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా.. రైతుల నోట్లో కేసీఆర్ సర్కార్ మట్టి కొడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో రైతాంగానికి, వ్యవసారంగానికి ఏ రకంగా మేలు చేయనోళ్లు.. నేడు దేశ రైతుల కోసం తమ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణితో పల్లెలు ప్రశాంతత కోల్పోయన్నారు. ధరణితో అనేక భూ వివాదాలు, సమస్యలు తలెత్తయని, ధరణి పోర్టల్ పెద్దోళ్లకు అనుకూలంగా.. సామాన్యులకు శాపంగా మారిందన్నారు. అనేక భూవివాదాలకు సమస్యలకు ధరణి నేడు నిలయంగా మారిందని, తమ భూ సమస్యలు పరిష్కరించాలని సామాన్యులు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన ఫలితం లేకుండా పోతుందనిఆవేదన వ్యక్తం చేశారు. ధరణి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉందని ఆయన మండిపడ్డారు. దేశానికి వెన్నెముకలాంటి రైతన్నల శ్రేయస్సు కోసం, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేపట్టిన నరేంద్రమోదీ ప్రభుత్వం.. అదే రీతిలో తెలంగాణ రైతుల సాధికారత కోసం కూడా అనేక రకాల చర్యలను తీసుకుంటూ అండగా నిలిచిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతాంగ శ్రేయస్సు కోసం చేసిన పనులను గ్రహించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed