శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ

by Disha Web Desk 23 |
శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ
X

దిశ, సిరిసిల్ల : మత సామరస్యం, సహోదర భావంతో పండుగలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో పట్టణంలోని గణేష్ మండపాల నిర్వహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రానున్న గణేష్ చతుర్థి, మిలాద్ ఉల్ నబి పండుగలు మత సామరస్యం, సహోదర భావంతో పండుగలు జరుపుకోవాలని,గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబి వేడుకలు ఒకే రోజు వచ్చాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలను సంతోషంగా జరుపుకునేలా జిల్లా పోలీస్ శాఖ తరపున బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గణేష్ మండప నిర్వహకులు మండపాలు రోడ్డుకి అడ్డంగా ప్రజలకు,వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని, మండపాల వద్ద బాధ్యత కలిగిన నిర్వహణ కమిటీ సభ్యులు బాధ్యత తీసుకోవాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, షాట్ సర్క్యూట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మండపాలు, విగ్రహాల వద్ద విద్యుత్ వైర్ల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు కమిటీ సభ్యుల వివరాలు మండపం బాద్యుల ఫోన్ నెంబర్ తో కూడిన ఫ్లెక్సీలను మండలం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండపం వద్ద విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, బ్లూ కోల్ట్ సిబ్బంది తరచు మండపాలు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. మండపాల్లో,నిమార్జనం రోజున డీజే లకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ, నిమార్జనం రోజున ఉపయోగిస్తే డీజే వారితో పాటుగా మండపాల నిర్వాహకులను బైండోవర్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. పోలీస్ వారి సలహాలు సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉదేయ్ రెడ్డి, సీఐ ఉపేందర్, ఎస్ ఐ లు ప్రేమానందం, రాజు సిబ్బంది పాల్గొన్నారు.


Next Story