రాజన్న ఉద్యోగుల్లో ఏసీబీ గుబులు

by Mahesh |
రాజన్న ఉద్యోగుల్లో ఏసీబీ గుబులు
X

దిశ, వేములవాడ : దక్షిణకాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆలయంలో జరుగుతున్న అవినీతిపై, ఉద్యోగులు చేస్తున్న అక్రమాలపై ‘దిశ’ పత్రికలో విశ్లేషణాత్మకతతో కూడిన వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అంతేకాక మరికొన్ని ప్రధాన పత్రికలు, ఛానెళ్లలో నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర సర్కార్ ఆలయంలో జరుగుతున్న అవినీతిపై, ఉద్యోగుల తీరుపై ఓ కన్నేసి ఉంచాలని ఏసీబీ అధికారులకు సూచించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలతో రాజన్న ఆలయం పై ఏసీబీ అధికారుల నజర్ పడినట్లు సమాచారం అందడంతో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆలయ ప్రధాన విభాగాల్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులైతే నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు ఆలయంలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులే చర్చించుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏసీబీ అధికారులకు అక్రమార్కుల చిట్టా

రాజన్న ఆలయంలో ఏండ్ల తరబడి పనిచేస్తూ అవినీతి అక్రమార్కులకు పాల్పడుతున్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన చిట్టా ఇప్పటికే ఏసీబీ అధికారుల చేతుల్లోకి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆలయంలో పని చేస్తూ అక్రమాలకు పాల్పడిన 14 మంది ఉద్యోగులకు సంబంధించిన విజిలెన్స్ నివేదికతో పాటు హోదాను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిన మరికొందరి ఉద్యోగుల చిట్టా ఏసీబీ అధికారుల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆలయంలో ఏ క్షణానైనా మూకుమ్మడి ఏసీబీ దాడులు జరగొచ్చనే చర్చ నడుస్తోంది.

కార్యాలయాలకు ఆకాశ రామన్న ఉత్తరాలు

ఇక ఇదంతా ఇలా ఉంటే ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై, అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆకాశ రామన్న ఉత్తరాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆలయ ప్రధాన కార్యాలయంతో పాటు ఉద్యోగుల ఇండ్లల్లో ఏసీబీ అధికారులు దాడులు జరపాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంతోపాటు కరీంనగర్ ఏసీబీ కార్యాలయానికి ఆకాశ రామన్నల పేరుతో ఇప్పటికే పదుల సంఖ్యలో ఉత్తరాలు వెళ్లినట్లు సమాచారం. ఇంకా చాలా లేఖలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్, పౌర, మానవ హక్కుల సంస్థలు కూడా దేవాదాయ శాఖ అధికారులతో పాటు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

ప్రభుత్వం స్పెషల్ ఫోకస్..

గత కొన్ని రోజులుగా రాజన్న ఆలయంపై మీడియాలో వస్తున్న వరుస కథనాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజన్న ఆలయంలో ప్రక్షాళన జరగాల్సిందేనని, అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాల్సిందేనని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏండ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయిన ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేస్తేనే ఆలయంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతి అక్రమాలకు చెక్ పెట్టొచ్చని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఆలయ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరినట్లు సమాచారం.

ఉద్యోగుల్లో ఆందోళన..

ఆలయంలో ఈ మధ్య జరుగుతున్న కీలక పరిణామాలు ఆలయ ఉద్యోగుల టెన్షన్‌ను మరింత రెట్టింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రతి నిత్యం పత్రికలు, చానెళ్లలో వరుస కథనాలు రావడం, ఈ విషయంలో నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా ఉండడంతో ఎప్పుడూ ఏమి జరుగుతుందోనని ఉద్యోగుల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఏసీబీ అధికారుల చేతిలో అక్రమార్కుల చిట్టా ఉందని చర్చ జరుగుతుండడంతో వారు ఏ క్షణాన వచ్చి తమపై, దేవాలయ కార్యాలయంపై మూకుమ్మడిగా దాడులు చేస్తారోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా రాజన్న ఆలయ ప్రక్షాళనలో భాగంగా ఉద్యోగులను బదిలీ చేయడం, అక్రమార్కుల ఆట కట్టించడం, అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఈ క్రమంలోనే 'ఆది దేవుడి' నీడన అక్రమాలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టేదే లేదని, గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలను తాము ఎట్టి పరిస్థితుల్లో చేయబోమనే ముందుచూపుతో ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది వేచి చూడాలి..Next Story

Most Viewed