ఐడి కార్డ్ అడిగిన ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ (వీడియో)

by Disha Web Desk 12 |
ఐడి కార్డ్ అడిగిన ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ (వీడియో)
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో భద్రత విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఓ కానిస్టేబుల్ ఎస్ఐతో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కొండపైకి వెళ్లే మార్గంలో చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న జగిత్యాల డీసీ ఆర్బీ ఎస్ఐ పురుషోత్తం అటుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని కొండపైకి అనుమతి లేదని ఆపారు. దీంతో బైక్ పై వచ్చిన వ్యక్తి తాను పోలీస్ కానిస్టేబుల్ అని భద్రత విధులు నిర్వర్తించేందుకు వచ్చానని ఎస్ఐకి తెలిపారు. అయితే ఐడి కార్డు చూపించాలని ఎస్సై కోరగా ఆగ్రహించిన కానిస్టేబుల్ ఇష్టారీతిన మాట్లాడటంతో ఎస్సై ఖంగుతిన్నాడు.

ఐడి కార్డు లేదు అయితే నేనేమైనా దొంగనా లేక నక్సలైటా అంటూ ఎస్సై పై రివర్స్ అయ్యాడు. మర్యాదగా మాట్లాడాలని ఎస్సై కోరడంతో వంగి వంగి దండాలు పెట్టాలా అంటూ సదరు కానిస్టేబుల్ బదులిచ్చాడు. అక్కడే విధుల్లో ఉన్న ఇతర పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్‌ను వారించే ప్రయత్నం చేసినప్పటికి ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనపడలేదు. ఎస్సై పై దురుసుగా వ్యవహరించిన కానిస్టేబుల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా తెలియ వచ్చింది. ఈ తతంగాన్ని అంతా ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా నెట్టింట వైరల్‌గా మారింది. క్రమశిక్షణకు మారుపేరు గా ఉండాల్సిన పోలీస్ శాఖలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.

పూజారులను అడ్డుకున్న డీఎస్పీ

కొండగట్టు ఆలయం వెనుక భాగంలో భద్రత విధులు నిర్వహిస్తున్న ఓ డీఎస్‌పి అర్చకులను గుడిలోకి అనుమతించకపోవడంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. తమను అడ్డుకుంటే స్వామివారికి నిర్వర్తించే కైంకర్యాలు ఎవరు చేస్తారని అర్చకులు సదరు పోలీస్ అధికారులు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన అధికారి పాస్ లు ఉన్నవారిని తప్ప వేరే వారిని లోపలికి పంపించవద్దని ఆదేశాలు ఉన్నాయని తెలపగా స్థానిక పోలీస్ అధికారులు సర్దిచెప్పి అర్చకులను పంపించారు. పోలీస్ అధికారి తీరుపై అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story