పౌరసరఫరాల శాఖ మంత్రి వైఫల్యంపై సీఎం స్పందించాలి : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

by Disha Web Desk 1 |
పౌరసరఫరాల శాఖ మంత్రి వైఫల్యంపై సీఎం స్పందించాలి : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
X

దిశ, కరీంనగర్ టౌన్ : పౌరసరఫరాల శాఖ మంత్రి వైఫల్యంపై సీఎం స్పందించాలంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లాలోని వివిధ ఐకేపీ సెంటర్లను వారు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి వారం రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు.

అధికారులు 360 సెంటర్లలో కొనుగోలు సెంటర్లను ప్రారంభించామని చెప్పినప్పటికీ కేవలం 160 సెంటర్లలో మాత్రమే కొనుగోలు జరుగుతోంన్నారు. నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో రైతులకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. విషయం అధికారుల అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ శనివారం నుంచి కొనుగోలు ప్రక్రియ ఆగిపోయిందని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 రోజుల ముందు ధాన్యం కొనుగోలు ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

ప్రభుత్వ అసమర్ధత వల్ల కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు, లారీలు, ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళనలు చేపడుతున్నారని తెలిపారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలు దాచి పెడుతున్నారని అన్నారు.

తిమ్మాపూర్ మండలంలో 50 వేల క్వింటాళ్ల ధాన్యం కొనాల్సి ఉండగా గడిచిన వారం రోజుల్లో కేవలం 3 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని అధికారులే చెబుతున్నారని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో కేవలం 2,267 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. సివిల్ సప్లై శాఖ వెబ్ సైట్ లో ఉన్న సమాచారానికి ప్రజాప్రతినిధులు చెప్పే వివరాలకు పొంతన లేదన్నారు. 25 రోజులుగా ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండగా వాటిపై దృష్టి పెట్టని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సంబరాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పునర్నిర్మాణ సంబరాలు వేడుకల నుంచి బయటకు వచ్చి కన్నీరు పెడుతున్న రైతుల ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు. మేము రైతుల పక్షాన కలెక్టర్ కాళ్లు మొక్కి వేడుకున్నా.. ప్రభుత్వానికి చలనం లేదని అవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు సెంటర్లలో ధాన్యం వచ్చి ఎన్ని రోజులు అయిందో, ఎంత మేరకు కొనుగోలు జరిగిందో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరుతున్నా. మంత్రికి సవాల్ స్వీకరించే దమ్ముందా.. అంటూ ఫైర్ అయ్యారు. అధికారంలో లేకపోయినా మేము రైతు బిడ్డలమే, రైతుల గోడు తెలిసిన వారమే అన్నారు.

ఇది రాజకీయ పంచాయతీ కాదు, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడమే మా ఉద్దేశమని, రైస్ మిల్లర్ల దయాదాక్షిన్యాల మీద ధాన్యం అమ్ముకోవలసిన కర్మ రైతుకు పట్టలేదని అన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి వైఫల్యంపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులు కన్నీరు పెడుతుంటే సీఎం కూడా ఉత్సవాల పేరుతో ఆర్భాటం చేస్తున్నారని, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం మంచిది కాదని సీఎంకు తెలియజేస్తున్నామన్నారు.


Next Story

Most Viewed