సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకిరీ

by Mahesh |
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకిరీ
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: గురుకుల పాఠశాలలో సీటు కావాలా? అయితే ఆ సార్ ని కలిస్తే చాలు మీ పని అయిపోతుంది. ఎంచక్కా మీ అబ్బాయికి ఆ సార్ సీట్ ఇప్పిస్తాడు. కాకపోతే ఖర్చుల కింద సారుకు కట్నం చదివించాలి. ఇక జాయిన్ అయ్యాక చదువు సంగతి అటు ఉంచితే బతకడానికి ఏదో ఒక పని రావాలి కదా అని చెప్తూ విద్యార్థులతో గుంతలు తవ్వించడం, కారు కడిగించడం లాంటి పనులు చేయిస్తూ విద్యార్థులను బాల కార్మికులుగా తీర్చిదిద్దే కార్యాన్ని కూడా సారే నెరవేర్చుతారు.

జగిత్యాల జిల్లాలోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న వైస్ ప్రిన్సిపాల్ తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. సదరు పాఠశాలకు ప్రిన్సిపాల్ ఉన్నప్పటికీ పాఠశాలకు సంబంధించి అన్ని తానై వ్యవహరిస్తూ హాస్టల్ సీట్లను సైతం అమ్ముకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అధ్యాపకుల తీరుతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ప్రభుత్వ సంకల్పం నీరుగారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కారు కడిగించిన వైస్ ప్రిన్సిపాల్..

జిల్లాలోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాధ్యత గల వైస్ ప్రిన్సిపాల్ గా ఉంటూ విద్యార్థులను తన పిల్లలుగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు ఓ విద్యార్థి చేత తన సొంత కారును కడిగించడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా సాంఘిక సంక్షేమ పాఠశాలలో అధిక భాగం విద్యార్థులు షెడ్యూల్ కులానికి చెందిన వారే ఉండటంతో వారిని తక్కువగా చూస్తూ.. కులం పేరు అడుగుతూ.. తన అజమాయిషీనీ చెలాయిస్తూ.. వ్యక్తిగత పనులకు విద్యార్థులను వాడుకుంటున్నారని సదరు వైస్ ప్రిన్సిపాల్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగకుండా క్లాసులు జరిగే సమయంలో కొందరు విద్యార్థుల చేతికి పలుగు, పార ఇచ్చి మొక్కలు నాటడానికి గుంతలు తవ్విస్తూ.. విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నాడు.

సాయంకాలం పూట పాఠశాలకి కొద్ది దూరంలో ఉన్న ఇటుక బట్టి నుంచి ఇటుకలను మోపిస్తూ విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. చదువు చెప్పడం అనే విషయం ఎప్పుడో మర్చిపోయిన సదరు అధ్యాపకుడు క్లాసులకు వెళ్లకుండా విద్యార్థులతో ఎప్పుడు ఏ పని చేయించాలని ఆలోచిస్తూ ఉంటాడని అతని విషయంలో కళాశాల ప్రిన్సిపాల్ సైతం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నాడని విమర్శలు లేకపోలేదు.

విచారణ జరిపితే వెలుగులోకి అక్రమాలు..

జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల పనితీరు సిలబస్ అధ్యాపకుల హాజరు వంటి విషయాలపై సంబంధిత అధికారులు విచారణ జరిపితే ఇలాంటి విషయాలు మరెన్నో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. హాస్టల్ సీట్లను అమ్ముకోవడమే కాకుండా విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ఇలాంటి అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకుంటే గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి సత్ఫలితాలు రాబట్ట వచ్చునని పలువురు విద్య వేత్తలు అభిప్రాయపడుతున్నారు.Next Story

Most Viewed