విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఏసీడీ ఛార్జీలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 19 |
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఏసీడీ ఛార్జీలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఏసీడీ చార్జీలకు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. వినియోగదారుల నుండి ప్రభుత్వం వసూలు చేస్తున్న ఏసీడీ చార్జీలను వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ఇందిరా భవన్ నుండి విద్యుత్ ప్రగతి భవన్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్రంలో ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అనే రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉంటే కేవలం నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పైన మాత్రమే అడిషనల్ కంసంప్షన్ చార్జీలు వసూలు చేస్తున్నారని.. అవి కూడా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజమాబాద్, అదిలాబాద్ ఈ ఐదు జిల్లాలోనే వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

నష్టాలలో మునిగిపోయిన విద్యుత్ సంస్థలను కాపాడేందుకు ప్రజలపై అదనపు భారం వేయడం ఎంతవరకు సమంజసం అని అధికారుల తీరును తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఏసీడీ బిల్లులు వసూలు చేయకుండా.. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలలోనే ఎందుకు ఈ బిల్లులు వసూలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారాన్ని తగ్గించే విధంగా అనుకూలమైన ప్రదేశాలలో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ కమిషన్ల కక్కుర్తికే రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిలో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. ఏసీడీ బిల్లులను రద్దు చేయకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామనిఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed