కడియం కావ్య ఎఫెక్ట్.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినా కనిపించని మరో సిట్టింగ్ ఎంపీ

by Disha Web Desk 13 |
కడియం కావ్య ఎఫెక్ట్.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినా కనిపించని మరో సిట్టింగ్ ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో ఖమ్మం పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. ఓవైపు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రచారం స్పీడప్ చేయగా, అధికార పార్టీ హోదాలో ఈ స్థానం తమదే అని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఇక్కడ మిగతా పార్టీలకంటే ముందే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. నామా పేరును ఖరారు చేసి నెల రోజులకు దగ్గరవుతున్నా ఆయన మాత్రం క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలు పెట్టకపోవడం పట్ల కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కడియం కావ్య ఎఫెక్ట్‌తో మరికొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోబోతున్నారనే ప్రచారం వేళ నామా పేరు తెరపైకి వస్తోంది. దీంతో ఆయన పోటీలోనే ఉంటారా? లేక కావ్య బాటలోనే పోటీ నుంచి డ్రాప్ అవుతారా అనేది ఖమ్మం బీఆర్ఎస్‌లో ఉత్కంఠగా మారింది.

తప్పుకుంటారా.. పార్టీ మారుతారా?

అభ్యర్థిగా నామా పేరును అధిష్టానం ప్రకటించినా ఆ వెంటనే తన కుమారుడి వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీలో చోటుచేసుకున్న బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలోనూ టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా అభ్యర్థిని బరిలోకి దింపబోతున్నారనే ప్రచారం జరగగా నామా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. దీన్ని ఆయన ఖండించినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్లకపోవడం సందేహాలకు దారి తీసింది. తాజా పరిణామాలతో పార్టీ ప్రతిష్ట దిగజారడమే కాకుండా, నాయకుల మధ్య సమన్వయం లోపించిందని కావ్య ఆరోపించారు. ఖమ్మం బీఆర్ఎస్‌లోనూ గ్రూప్ రాజకీయాలు పెచ్చుమీరుతున్నాయని ఎవరికి వారే ప్రత్యేక వర్గాలుగా ఏర్పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడంపై నామా ఆలోచనలో పడ్డారని త్వరలోనే ఆయన పోటీ నుంచి తప్పుకోవడం లేదా పార్టీ మారడం ఖాయమనే అనే టాక్ జోరందుకుంటోంది.

కాంగ్రెస్ వెయిటింగ్ అందుకేనా?

నామా పార్టీ మారుతారనే ఊహాగానాలకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కొందరు లింక్ పెడుతున్నారు. తొలుత బీజేపీ, టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఖమ్మంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్‌లో ఖమ్మం టికెట్‌పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణితో పాటు మంత్రులు తుమ్మల, పొంగులేటి కుటుంబ సభ్యులు సైతం రేసులో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం డైలమాలో పడిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని కాదని కొత్త వ్యక్తి పేరును పరిశీలిస్తోందనే టాక్ వినపిస్తోంది. ఇప్పటికే ఓ ప్రముఖ వ్యాపార వేత్త పేరును పరిశీలిస్తున్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక వేళ నామా పార్టీ మారి వస్తే ఆయనకు ఇచ్చినా ఇవ్వొచ్చని ఇందుకు సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, వరంగల్ సెగ్మెంట్లే ఉదాహరణ అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed