ఆర్వోబీల నిర్మాణంలో ఇంత జాప్యమా?

by samatah |
ఆర్వోబీల నిర్మాణంలో ఇంత జాప్యమా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధులు మంజూరై ఆరు నెలలు దాటినా పనుల్లో పురోగతి లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ రహదారులు, రవాణా శాఖ రీజనల్ అధికారి ఎసె‌కే కుశ్వహా.. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి ఆర్వోబీ సహా రాష్ట్రవ్యాప్తంగా 5 ఆర్వోబీల నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలుపుతూ గతేడాది నవంబర్ లో రూ.432 కోట్ల 84 లక్షలను మంజూరు చేసింది. నిధులు మంజూరై 6 నెలలు దాటినా ఇంతవరకు నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 11న కేంద్రానికి లేఖ రాశారు. మరీ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తీగలగుట్ట సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) నిర్మాణంలో జరుగుతున్న జాప్యంవల్ల స్థానిక ప్రజల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడిందని లేఖలో ఆయన పేర్కొన్నారు. తొందరగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని పలుమార్లు రాష్ట్ర ఆర్అండ్‌బీ అధికారులను కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. బండి సంజయ్ రాసిన లేఖ ఆధారంగా కేంద్ర రీజనల్ అధికారి కుశ్వహ.. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. కరీంనగర్ లోని తీగలగుట్టపల్లితోపాటు హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, వికారాబాద్ లలో మంజూరైన ఆర్వోబీల నిర్మాణంలోనూ పురోగతి లేని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం వెంటనే ఆర్వోబీ నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇదిలా ఉండగా కరీంనగర్ లోని తీగలగుట్టపల్లిలో ఆర్వోబీ నిర్మాణం కోసం బండి సంజయ్ కుమార్ ఎంపీ అయినప్పటి నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం రైల్వే శాఖ మంత్రితోపాటు, రైల్వే బోర్డు చైర్మన్, దక్షిణ మధ్య రైల్వే శాఖ జనరల్ మేనేజర్ సహా ఉన్నతాధికారులందరినీ కలిసి ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. ఆర్వోబీ లేకపోవడంవల్ల జరుగుతున్న ఇబ్బందులను వివరించారు. బండి సంజయ్ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ ఆర్వోబీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. అందులో భాగంగా రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఒప్పందం కుదిరింది. ఈ మొత్తం వ్యయంలో 80 శాతం మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 20 శాతం కేంద్ర ప్రభుత్వం భరించేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 15న కన్సెంట్ లెటర్ కూడా ఇచ్చింది. ఆర్వోబీ ఏర్పాటుకు ఎంత వ్యయం అవుతుందనే దానిపై అధ్యయనం చేసిన అధికారులు దాదాపు రూ.100 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ 80 శాతం వాటా కింద రూ.79.84 కోట్లు శాతం వాటా చెల్లించాలంటూ లేఖ రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అనూహ్యంగా యూ టర్న్ తీసుకుంది. ఈ మొత్తాన్ని తాము చెల్లించలేమని, ఆర్వోబీ నిర్మాణాల విషయంలో కేంద్రం కొత్తగా తీసుకున్న విధాన నిర్ణయాన్నే అమలు చేయాలని కోరుతూ మెలిక పెట్టింది. దీంతో కేంద్ర మంత్రిసహా ఉన్నతాధికారులను కలిసి బండి సంజయ్ చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్రం సేతు భారతం కార్యక్రమంలో భాగంగా 100 శాతం నిధులతో రాష్ట్రంలోని 5 ఆర్వోబీలను నిర్మాణానికి ఆమోదం తెలిపి గత నవంబర్లోనే నిధులు మంజూరు చేసింది. అయినా నేటికీ ఆ నిర్మాణాలను పూర్తి చేయకపోవడంతో బండి సంజయ్ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో నిర్ణీత గడువులోగా ఆర్వోబీల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. అనుకున్న సమయానికి పూర్తిచేయాలని ఆదేశించింది.Next Story

Most Viewed