పెరుగుతున్న మావోయిస్టుల కదలికలు.. ఆ ప్రాంతాల్లో సెక్యూరిటీ టెన్షన్

by Disha Web Desk 4 |
పెరుగుతున్న మావోయిస్టుల కదలికలు.. ఆ ప్రాంతాల్లో సెక్యూరిటీ టెన్షన్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : తెలంగాణ - ఛత్తీస్​గఢ్ ​సరిహద్దుల్లో భద్రతా విధులు మన పోలీసులకు కత్తి మీద సాములా మారాయి. మావోయిస్టుల కార్యకలాపాలు ఇటీవలిగా ఎక్కువైన నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటం సవాల్​గా మారింది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తున్న సిబ్బందిలో దాదాపు ఎనభై శాతం మంది కొత్తగా రిక్రూట్​ అయిన పోలీసులే ఉండటం. ఛత్తీస్‌గఢ్ ​రాష్ర్టం సుక్మా, బస్తర్ ​జిల్లాల్లో ఇటీవలిగా మావోయిస్టుల కార్యకలాపాలు జోరైన విషయం తెలిసిందే. గతనెల 26న పకడ్భంధీ వ్యూహం ప్రకారం అరణ్​ పూర్ ​రోడ్డులో మందుపాతర పేల్చిన మావోయిస్టులు పదిమంది పోలీసులను హతమర్చారు.

ఈ సంఘటనలో ఓ పౌరుడు కూడా మరణించాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన జరిగిన రెండు మూడు రోజులకే పోలీసులు జరిపిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. అదే రోజున మావోయిస్టులు రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న మూడు వాహనాలను దగ్ధం చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్​గా పనిచేస్తున్నాడన్న అనుమానంతో ఓ గ్రామస్తున్ని హత్య చేశారు. రెండు రోజుల క్రితం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు పోలీసు జవాన్లు తీవ్రంగా గాయపడగా దీనికి ముందు రోజు జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు బుల్లెట్ ​గాయాలకు గురయ్యారు.

ఇలా వరుస సంఘటనలతో ఛత్తీస్​గఢ్ ​రాష్ట్రంలో ఉండి తెలంగాణకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. చెప్పాలంటే అక్కడ పోలీసులు...మావోయిస్టుల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. దీని ప్రభావం సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ గ్రామాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల్లో భద్రతను ఉన్నతాధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్​లో ఆయా జిల్లాల డీఎస్పీలతో మాట్లాడిన డీజీపీ అంజనీ కుమార్ అవాంఛనీయ సంఘటనలు జగరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అయితే, ఇక్కడే పోలీసు ఉన్నతాధికారులకు ఓ సవాల్​ ఎదురవుతోంది. దీనికి కారణం సరిహద్దు గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో ఎనభై శాతం మంది కొత్తగా పోలీసుశాఖలో చేరిన వారే కావటం. ఇక్కడ ఏళ్ల తరబడి పనిచేసిన వారిలో చాలామంది రిటైర్మెంట్​కు దగ్గర పడటం, కొందరు ఆరోగ్య సమస్యలతో ఇతర ప్రాంతాలకు బదిలీలపై వెళ్లిపోయారు. దాంతో కొత్తగా వచ్చిన సిబ్బందికి మావోయిస్టుల వ్యూహాలు...భద్రతా విధుల్లో ఉన్నపుడు ఎలా వ్యవహరించాలి? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? మావోయిస్టుల గురించి సమాచారాన్ని ఎలా సేకరించాలి? అన్నదానిపై మార్గదర్శకత్వం చేసేవారు లేకుండా పోయారు.

ఇదే సమయంలో మావోయిస్టు యాక్షన్ ​టీముల కదలికలు ఎక్కువైనట్టు నిఘావర్గాలు చెబుతున్నాయి. దాంతో శాంతిభద్రతలను కాపాడటం పోలీసు సిబ్బందికి ప్రస్తుతం సవాల్​గా మారింది. ఈ క్రమంలోనే డీజీపీ అంజనీకుమార్​ ఇటీవల గ్రేహౌండ్స్​ డీజీ విజయ్​కుమార్​, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) సంజయ్​ కుమార్​ జైన్, ఎస్ఐబీ ఐజీ ప్రభాకర్​రావు, ఐజీలు చంద్రశేఖర్​రెడ్డి, షానవాజ్ ​ఖాసీం తదితరులతో కలిసి సరిహద్దు ప్రాంతాల డీఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడ్డ నేపథ్యంలో రాజకీయ నాయకుల పర్యటనలు, కార్యక్రమాలు పెరుగుతాయని చెబుతూ మరింత జాగరూకతతో ఉండాలని చెప్పారు.

మావోయిస్టుల యాక్షన్​ టీముల కదలికలు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పారు. మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెబుతూ ఏ చిన్న సంఘటన జరిగినా దాని ప్రభావం రాష్ర్టం మొత్తం మీద పడుతుందని తెలిపారు. పోలీసుల కృషితో తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అంతమైనా జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పారు. ప్రస్తుతం ఎనభైశాతం మంది సిబ్బంది కొత్తవారే ఉన్నారని పేర్కొంటూ మావోయిస్టుల ఆకస్మిక దాడులు జరిపినపుడు, అనుకోని పరిస్థితులు ఏర్పడినపుడు, భద్రత ఎలా కల్పించాలి అన్న అంశాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రతీ గ్రామాన్ని పోలీసులు ఒకటికి రెండుసార్లు సందర్శించాలని చెబుతూ గ్రామస్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవాలని సూచించారు. గ్రామస్తుల సహకారంతో మావోయిస్టుల కదలికల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలన్నారు. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల పోలీసులు ఈ విషయంలో మరింత అలర్ట్​గా ఉండాలని చెప్పారు.



Next Story