నష్టాల నుంచి గట్టెక్కించడానికి TSRTC కీలక నిర్ణయం

by Disha Web Desk 2 |
నష్టాల నుంచి గట్టెక్కించడానికి TSRTC కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి విలేజ్ బస్ ఆఫీసర్ల విధానం తెరపైకి వస్తున్నది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చే ఈ విధానంతో కొత్తగా ఎలాంటి రిక్రూట్‌మెంట్స్ ఉండవు. కానీ ప్రస్తుతం నివసిస్తున్న గ్రామాలు, పట్టణాల్లోని ఆర్టీసీ సిబ్బందినే విలేజ్/వార్డు బస్ ఆఫీసర్లుగా (వీబీఓ) నియమించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది. సంతృప్తికరమైన ఫలితాలు వచ్చిన చోట వీరిని మరింతగా ఉత్సాహపర్చడానికి ప్రోత్సాహకాలను ఇవ్వాలని యాజమాన్యం భావిస్తున్నది. గ్రామాల్లో పెళ్ళిళ్ళు, జాతర తదితర ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ బస్‌ను అద్దెకు బుక్ చేసుకున్నప్పుడు ఆ దిశగా చొరవ చూపిన వీబీఓలకు కమిషన్ రూపంలో కొంత ఇవ్వాలనే సూత్రప్రాయ నిర్ణయం జరిగింది. ఈ నెల 26వ తేదీకల్లా ఆర్టీసీ సర్వీసులు ఉన్న అన్ని గ్రామాల్లో వీబీఓల నియామకం పూర్తయ్యేలా రీజినల్, డిపో మేనేజర్లకు ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి.

ఆర్టీసీ సిబ్బందిని స్వచ్ఛందంగా ఈ విధులు నిర్వర్తించడానికి యాజమాన్యం ఎంకరేజ్ చేస్తున్నది. వీక్లీ ఆఫ్, స్పెషల్ ఆఫ్ రోజుల్లో వీరు వీబీఓలుగా పనిచేస్తారు. ప్రతి నెలకు రూ. 300 చొప్పున ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామాల్లో ప్రజలతో సత్సంబంధాలు కలిగినవారికి ప్రాధాన్యత ఇచ్చేలా గైడ్‌లైన్స్ రూపొందించిన ఆర్టీసీ మేనేజ్‌మెంట్.. గ్రామ పంచాయతీ కార్యాలయానికి డిపో మేనేజర్ల నుంచే అధికారికంగా ఫలానా వ్యక్తిని నియమించినట్లు ఉత్తర్వులు జారీ అవుతాయి. వీబీఓలు సైతం వారి ఇంటి ముందు ఈ మేరకు నేమ్ బోర్డు పెట్టుకునే వెసులుబాటు కల్పించింది. ప్రతి నెలా మొదటి మంగళవారం రోజున రీజినల్ మేనేజర్లు వారి పరిధిలోని గ్రామాల వీబీఓలతో సమీక్ష నిర్వహించి పనితీరుపై చర్చిస్తారు. వారి నుంచి వచ్చిన అంశాలపై యాజమాన్యం తరఫున తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్షిస్తారు.

ప్రతి నెలా చివరి మంగళవారం రోజున డిపో మేనేజర్లు, వీబీఓల మధ్య సమావేశం జరుగుతుంది. వీబీఓ వ్యవస్థలోని అనుకూల, ప్రతికూల పరిస్థితులపై చర్చించి తదనుగుణమైన నిర్ణయాలు జరగనున్నాయి. వీబీఓల పేరుతో కొత్తగా రిక్రూట్‌మెంట్‌లు లేకుంటా స్థానికంగా ఆర్టీసీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బందినే ఈ సేవలకు వినియోగించుకునేలా మార్గదర్శకాలు రూపొందాయి. వీబీఓలు స్థానికంగానే ఉంటున్నందున ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు సేవలను అందించడం, చివరకు సంస్థకు ప్రయోజనం కలిగేలా చూసేందుకే ఈ విధానాన్ని తెరపైకి తెచ్చింది. గ్రామాల్లో ప్రస్తుతం విలేజ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరులోనే విలేజ్ బస్ ఆఫీసర్ సిస్టమ్ కూడా పనిచేయనున్నది.



Next Story

Most Viewed