తాజా సర్వేలో కేసీఆర్ సన్నిహితుడికి మరోసారి భంగపాటే! కరీంనగర్‌ లో ఆ పార్టీదే గెలుపు

by Disha Web Desk 13 |
తాజా సర్వేలో కేసీఆర్ సన్నిహితుడికి మరోసారి భంగపాటే!  కరీంనగర్‌ లో ఆ పార్టీదే గెలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్న బీజేపీ దక్షిణ భారతదేశంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా తెలంగాణలో పవర్ పుల్ స్కెచ్ వేస్తోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం చాన్స్ లేకుండా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నది. అయితే ఈసారి తెలంగాణ గడ్డపై నువ్వా? నేనా? అన్నట్లుగా ప్రధాన పార్టీలు పొలిటికల్ ఫైటింగ్‌కు దిగగా తాజాగా కరీంనగర్ పార్లమెంట్ స్థానం హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానాన్ని ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టే అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా జన్ లోక్ పోల్ నిర్వహించిన సర్వేలే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

కమలం పార్టీకి 41.90 శాతం ఓట్లు..

కరీంనగర్ బరిలో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉండగా బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత బి.వినోద్‌కుమార్‌ను రంగంలోకి దింపింది. పలు దఫాలుగా చర్చలు జరిపినా కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. అయితే జన్ లోక్ పోల్ సర్వే ప్రకారం కరీంనగర్ ప్రజలు మరోసారి బండి సంజయ్ కుమార్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. ఈ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో బీజేపీ 41.90 శాతం ఓట్ షేరింగ్‌తో మొదటి స్థానంలో నిలువగా 28.25 శాతంతో కాంగ్రెస్, 26.62 శాతంతో బీఆర్ఎస్ ఆ తర్వాతి వరుసలో ఉన్నాయి. 3.23 శాతం మంది ఇతరుల వైపు మొగ్గు చూపారని తెలిపింది. మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ సర్వే ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది.

బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ?

తాను చేసిన అభివృద్ధి పనులతో పాటు రామమందిర నిర్మాణం, మోడీ చరిష్మాతో గెలుపుపై బండి సంజయ్ ధీమాతో ఉన్నారు. ఈసారి తాను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కాన్ఫిడెంట్ కామెంట్స్ చేస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. అధికార పార్టీ హోదాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై నమ్మకంతో ఉండగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌కు గట్టి షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన వినోద్.. ఈసారి ఏకంగా మూడోస్థానానికి పడిపోయే అవకాశాలు ఉన్నట్లు సర్వే అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా సర్వే ప్రకారం బండి సంజయ్, వినోద్‌కు మధ్య 15.28 శాతం ఓట్ షేర్ గ్యాప్ ఉన్నట్లు తేలింది. వలసలు, కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గందరగోళంలో ఉందనే చర్చ జరగుతోంది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండనుందన్న టాక్ వినిపిస్తోంది.


Next Story

Most Viewed