సర్వేలు నిజమైతే ఎందుకు ఓడినట్టు? కాంగ్రెస్‌ తీరుపై సొంత పార్టీ బీసీ నేతలు ఫైర్!

by Rajesh |
సర్వేలు నిజమైతే ఎందుకు ఓడినట్టు? కాంగ్రెస్‌ తీరుపై సొంత పార్టీ బీసీ నేతలు ఫైర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సర్వేలు నిజమైతే ..2018‌లో టిక్కెట్లు పొందిన చాలా మంది రెడ్డి అభ్యర్థులు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందని పార్టీకి చెందిన బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏఐసీసీ, టీపీసీసీ సర్వేలో వచ్చిన అభ్యర్థులనే ఎంపిక చేశామని గతంలో పార్టీ ప్రకటించి, ఆయా నేతలకు బీ ఫామ్‌లు ఇచ్చింది. కానీ వారిలో చాలా మంది రెడ్డి నేతలు ఎన్నికల్లో పరాభవం చెందడాన్ని ఏ విధంగా భావించాలని బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయని చెబుతూ గతంలో టికెట్ పొందిన రేవంత్ రెడ్డి, జనారెడ్డి, జీవన్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి తదితర నేతలంతా ఎందుకు ఓటమి చెందారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బోగస్ సర్వేల పేరిట బీసీలకు అన్యాయం చేసేందుకు కొందరు రెడ్డిలు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారని బీసీ లీడర్ల టీమ్ ఫైర్ అవ్వడం గమనార్హం.

ఢిల్లీకి పంచాయితీ

కాంగ్రెస్ పార్టీలో బీసీల పోరాటం తీవ్రమవుతున్నది. సీట్ల పంపిణీ, పార్టీలో ప్రాధాన్యత అంశాల్లో వివక్ష చూపుతున్నారంటూ మొదలు పెట్టిన నిరసన ఢిల్లీకి చేరనున్నది. బీసీ నేతలంతా పార్టీ అగ్రనేతలను కలిసేందుకు హస్తినాకు నేడు బయలు దేరనున్నారు. బుధవారం కేసీ వేణుగోపాల్, ఖర్గేను కలవనున్నట్టు సమాచారం. సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా బీసీ నేతలు కోరారు. అనుమతి రాగానే వారిద్దరినీ కలవునున్నారు. ప్రధానంగా బీసీ టిక్కెట్ల పంపిణీలో పార్టీలోని కొందరు రెడ్డిలు అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నారు.

బీసీ‌లకు టిక్కెట్లు రాకుండా చేయాలనే లక్ష్యంతో ఆయా అగ్రకులాల లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని హైకమాండ్ ముందే తేల్చుకుంటామంటూ బీసీ లీడర్లు స్పష్టం చేస్తున్నారు. ప్రదేశ్ అఫైర్స్ కమిటీ, ప్రదేశ్​ఎలక్షన్ కమిటీలో తీర్మానించిన 34 సీట్ల కన్నా అదనంగా మరిన్ని ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తేనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పోటీ చేయాలనుకుంటున్న జాబితాను కూడా ఆయా నేతలు సిద్ధం చేశారు. 48 సీట్లకు సెగ్మెంట్లను ఎంపిక చేసి ఏఐసీసీకి ఇవ్వనున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం అగ్రనేతలు తుది నిర్ణయం తీసుకొని లిస్టు ప్రకటించే చాన్స్ ఉన్నదని కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్లు వివరించారు.

వాళ్లకే అనుకులమా?

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సర్వేలు జరగలేదని బీసీ లీడర్లు ముక్తకంఠంతో చెబుతున్నారు. సర్వేల పేరిట పీసీసీ ఖజానాను ఖాళీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఓ రెడ్డి లీడర్‌కు సర్వేలో ఎక్కువ పర్సంటేజ్ ఎలా? వచ్చిందని ప్రశ్నించారు. ఆయనతో పాటు ఆయన అనుచరులకూ సర్వేలో ఎక్కువ శాతం పాజిటివ్ వచ్చిందని టీపీసీసీకి చెందిన కొందరు రెడ్డి నేతలు చెప్పడం విచిత్రంగా ఉన్నదని బీసీ‌ నేతలు ఫైర్ అవుతున్నారు.

అంతేగాక అతనికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి అప్పజెప్పి.. సీనియర్లకు మొండి చెయ్యి చూపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు బలం కన్నా.. ముందు నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నేతలే బెటర్ అని బీసీ నేతలంతా ఏకకంఠంతో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సారి రెడ్డి నేతలను ప్రమోట్ చేస్తే మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న బీసీ నేతలకు న్యాయం ఎలా? జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ల కన్నా పార్టీ కోసం ఏండ్ల తరబడి కష్టపడుతున్న వారిని గెలిపించుకోవాలని బీసీ నేతలు పార్టీకి సూచిస్తున్నారు.

Advertisement

Next Story