డెడ్ లైన్ రెండు నెలలు.. కేంద్రం నిర్ణయంలో ఇరకాటంలో తెలంగాణ అధికారులు!

by Disha Web Desk |
డెడ్ లైన్ రెండు నెలలు.. కేంద్రం నిర్ణయంలో ఇరకాటంలో తెలంగాణ అధికారులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి విడుదలైన నిధులను రానున్న రెండు నెలల్లో పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసింది. ఒకవేళ ఖర్చు చేయకపోతే అవి 'అన్ స్పెంట్‌' జాబితాలోకి వెళ్ళిపోతాయని, వాటిని తిరిగి కేంద్రానికి పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలల గడువే ఉన్నదని, అప్పటికల్లా ఖర్చు చేయాలని సూచించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆయా స్కీమ్‌ల అమలు కోసం నిధులు విడుదలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డ్రాయింగ్ లిమిట్స్ పై ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని గుర్తుచేసింది. కేంద్ర ప్రభుత్వం గతేడాది మే నెలలో జారీచేసిన సర్క్యులర్‌ను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ జాగ్రత్తలు తీసుకున్నది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పది నెలలు పూర్తయింది. కానీ కొన్ని జిల్లాల్లో ఆయా పథకాలకు కేంద్రం నుంచి విడుదలైన నిధుల వినియోగం ఏ లిమిట్స్ లో ఉండాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినా ఖర్చు చేయలేదని అధికారులు గ్రహించారు. ఈ నిధులను రానున్న రెండు నెలల్లో ఖర్చు చేయకపోతే వాటిని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే కొన్ని నిధులు రాష్ట్ర ట్రెజరీ నుంచి ఎస్ఎన్ఏ ఖాతాకు బదిలీ అయినా అవి ఖర్చు కాకుండా మిగిలిపోతే అవి వచ్చే ఆర్థిక సంవత్సరం లెక్కల్లోకి వెళ్ళిపోతాయి. ఆ మేరకు మినహాయించుకుని తదుపరి సంవత్సరం కేటాయింపుల్లో కోత పడుతుంది. వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్న అధికారులు రానున్న రెండు నెలల్లో ఖర్చు చేయాలని సర్క్యులర్ ద్వారా నాలుగు రోజుల క్రితం స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరానికి నిధులు విడుదలైతే ఆ పన్నెండు నెలల వ్యవధిలోనే ఖర్చు చేయాలని ఆర్థిక శాఖ గతేడాది మే నెలలో అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ జారీచేసింది. విడుదల చేసినా ఖర్చు చేయకుంటే వాటిని తిరిగి కేంద్ర కన్సాలిడేటెడ్ ఫండ్ ఖాతాలోకి రాష్ట్ర ట్రెజరీ నుంచి జమ చేయాల్సిందిగా ఆ సర్క్యులర్‌లో డైరెక్టర్ ప్రతీక్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ సర్క్యులర్‌నే గమనంలోకి తీసుకున్న రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు, ప్రాజెక్టు ఆఫీసర్లకు ఈనెల 20న సర్క్యులర్ ఇచ్చారు. జిల్లాల పరిధిలో ఏజెన్సీల ద్వారా జరిగే పనులన్నింటినీ మానిటర్ చేయాలని, నిధుల విడుదలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా పీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పేర్కొన్న లిమిట్స్ మేరకు ఖర్చు చేయాలని సూచించారు.

ఏదేని పరిస్థితుల్లో నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి విడుదలైన నిధులను ఖర్చు చేయనట్లయితే అవి వృథా అయిపోయినట్లేనని, ఖర్చు కాకుండా మిగిలిపోయిన జాబితాలోకి వెళ్ళిపోతాయని స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ కారణంగా తదుపరి సంవత్సరానికి చేసే కేటాయింపులు తగ్గిపోతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చిన సూచనలు, డ్రాయింగ్ లిమిట్స్ కు అనుగుణంగా రెండు నెలల్లో పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని, పనులు చేసిన ఏజెన్సీలకు చెల్లింపులు చేయాలని సూచించారు. అన్ని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఈ నిబంధన వర్తిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆయా ఇంప్లిమెంటింగ్ శాఖల ద్వారా జిల్లా స్థాయి వరకు హెచ్‌ఓడీల నుంచి సూచనలు జారీ అయ్యాయి. కేంద్రం నుంచి నిధులు వచ్చినా వినియోగించనట్లయితే అది తదుపరి సంవత్సరంపై ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.



Next Story

Most Viewed