ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచనలు చేయాలి : ఎమ్మెల్సీ కవిత

by Disha Web Desk 15 |
ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచనలు చేయాలి : ఎమ్మెల్సీ  కవిత
X

దిశ, ముషీరాబాద్ : ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచనలు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 35వ జాతీయ పుస్తక ప్రదర్శనకు ఆమె విచ్చేసి మాట్లాడారు. కాగా బుక్ ఫెయిర్ లోనికి వచ్చే ఎంట్రెన్స్ వద్ద నుంచి ఎన్టీఆర్ స్టేడియం బయట వరకు ప్రజలు క్యూ కట్టారు. నగర నలుమూలల నుంచి పుస్తక ప్రియులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆదివారం కావడంతో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ బుక్ ఫెయిర్ ను సందర్శించారు. పుస్తక లవర్స్ తో బుక్ ఫెయిర్ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి స్టాల్ ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్టాల్, తెలంగాణ సాహిత్య అకాడమీ స్టాల్స్, గురుకులాల స్కూల్స్ ను సందర్శించారు. పిల్లల పుస్తకాలు, సాహిత్యం, కథల పుస్తకాలను ఆమె కొనుగొలు చేశారు. ఆ తర్వాత కవి, వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న రాసిన వల్లంకి తాళం సంకలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఫాసిస్ట్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో కవులు, కళాకారులు ప్రజలను చైతన్యం చెయ్యాల్సిన సమయం వచ్చిందన్నారు. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి నుండి ఆ పరంపర కొనసాగుతుందన్నారు. అనేక మంది గొప్ప కవుల వారసత్వాన్ని తెలంగాణ పునికిపుచ్చుకుందన్నారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్న గోరటి వెంకన్న వల్లంకి తాళం రచన అంతే అద్భుతంగా ఉందన్నారు. పనిలోంచి పుట్టిన పదాలను ఇటలీ భాషలో ఉపయోగిస్తారని, అదే ఒరవడితో తెలంగాణలో కూడా కష్టాలు, శ్రమ ద్వారా వారి రచనలు ఉంటాయని అన్నారు. అలాగే ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ గా తెలుగు కూడా ఖ్యాతిపొందిందన్నారు. అడవిని ఆకుపచ్చ కోవెలతో పోల్చడం అద్భుతమైన అంశమన్నారు. అందుకే నల్లమలలో యురేనియం తవ్వడాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు.

వాల్మీకి, బసవేశ్వరుడు, బుద్ధ పుస్తకాల పునర్ముద్రణ సభ

వాల్మీకి, బసవేశ్వరుడు, బుద్ధుల పుస్తకాల పునర్ముద్రణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ తిరుమలి, రిటైర్డ్ జేసీ వై.సత్యనారాయణ, కవి, అధ్యాపకులు నాళేశ్వరం శంకరం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ తిరుమలి మాట్లాడుతూ దేశంలో ఎక్కువ జనాభాగా ఉన్నా వెనుకబడిన తరగతుల వారు చైతన్యవంతులు, విద్యావంతులు కావాలన్నారు. అందుకు దోహదపడే స్పూర్తి ప్రదాతల సంక్షిప్త జీవిత చరిత్రల పుస్తకాలు రావడం ఆహ్వనించదగ్గ విషయమన్నారు. లిఖిత చరిత్రలో వక్రీకరణలు జరిగాయని, వాటిని సరి చేయాల్సిన బాధ్యత మన పై ఉందని, అందులో తమ వంతు కృషి చేస్తున్నామని బీసీసీఈ నిర్వాహకులు తెలిపారు.

కొంచెం నిప్పు - కొంచెం నీరు పుస్తకావిష్కరణ

ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 35 వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో అరణ్యకృష్ట రచించిన కొంచెం నిప్పు-కొంచెం నీరు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రఖ్యాత రచయిత ఓల్గా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓల్గా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో దేశంలోని స్త్రీలు పడుతున్న బాధలు, వారి సమస్యలపై రచయిత అరణ్యకృష్ట చక్కగా తన రచనలో స్పష్టం చేశారని అన్నారు. ప్రతి కుల హత్య వెనుక పరువు ఉంటుందని, ప్రతి పరువు వెనుక జెండర్ రాజకీయాలు, ఆస్తీ, రాజకీయాలు ఉంటాయనే విషయాన్ని రచయిత చక్కగా విషయపరిచారని తెలిపారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో దేశంలో జరిగే సామాజిక, సాంస్కృతిక, రాజకీయలపై అరణ్య కృష్ట చేసిన ప్రయత్నం బాగుందన్నారు. దేశంలో ప్రశ్నించే వారిపై జరుగుతున్న దాడులను ఆయన తన రచనల ద్వారా తెల్పడం ఇప్పుడు చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సజయ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల్లో ప్రశ్నించే మనుషుల పట్ల పాలక వర్గాలు అనుసరించే విధానాలు ఆందోళన కల్గిస్తున్నాయన్నారు. అరణ్య కృష్ట చేసే ప్రయత్నం ఇప్పుడు అవసరమన్నారు.

రాళ్లకుచ్చెను పుస్తకావిష్కరణ

అలిశెట్టి ప్రభాకర్ వేదికపై దాసరి మోహన్ కథా సంపుటి రాళ్లకుచ్చెను పుస్తకాన్ని తెలంగాణ కవులు సామూహికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు నందిని సిథారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ సౌందర్యాన్ని దాసరి మోహన్ ఈ కథ సంపుటిలో పొందుపర్చడం సంతోషకమరని అన్నారు. తెలంగాణ పల్లే పరిమళాలు రాళ్లకుచ్చెనులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తంగేడు పత్రిక ఎడిటర్ కాంచనపల్లి గోవర్ధన్, జంట నగరాల తెలంగాణ రచయితల సంఘం కందుకూరి శ్రీరాములు, ప్రముఖ కవి కూర చిదంబరం పాల్గొన్నారు.

Next Story

Most Viewed