బీజేపీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : బండి సంజయ్

by Disha Web Desk 15 |
బీజేపీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : బండి సంజయ్
X

దిశ, ముషీరాబాద్ : బీజేపీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే అని, నిరుద్యోగులకంటే రాహుల్ గాంధీ ప్రయోజనాలే ఆ పార్టీలకు ఎక్కువయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. టీఎస్ పీఎస్సీ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద "మా నౌకరీలు మాగ్గావాలి" పేరుతో బీజేపీ నిరుద్యోగ మహా ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామన్నారని, డీఎస్సీ-2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులారా.... ఇంకెన్నాళ్లీ మౌనం ? అని ప్రశ్నించారు.

ఒకరు బ్రోకర్...మరొకరు లిక్కర్... ఇంకొకరు లీకార్ అని ఎద్దేవా చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు నాశనమవుతున్నా స్పందించరా ? అని ప్రశ్నించారు. మీకు అండగా మేమున్నాం.... కేసీఆర్ పాలనను బొందపెట్టేదాకా ఉద్యమిద్దాం రండి అని పిలుపునిచ్చారు. జైళ్ల శాఖ డీజీ ఖబర్దార్... బీజేవైఎం నేతలను జైళ్లలో వేధిస్తారా ? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక మీకు చిప్పకూడు తిన్పిస్తామని, కేసీఆర్ ఫ్రభుత్వంపై ఆశ పెట్టుకోవద్దు... ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదన్నారు. లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా పోరాడదామన్నారు. పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారమిచ్చేదాకా ఊరుకోబోమన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ మూడు తరాల ఉద్యమం చేసిందని, 1952 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం, 1969 - 369 విద్యార్ధుల బలిదానం, 2001- మలిదశ ఉద్యమాల్లో విద్యార్థుల బలిదానం, ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ తొలి అసెంబ్లీలోనే ప్రకటించారని, ఇవి కాక ప్రైవేట్, ఐటీ, సింగరేణిలో లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని, కానీ కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. జీహెచ్ఎంసీలో 1700 మందిని ఒక కలం పోటుతో తీసివేస్తే తానే అడ్డుకున్నానని, కేసీఆర్ వల్ల ఆర్టీసీ లో 39 మందిని బలి తీసుకున్న విషయం మర్చిపోవద్దన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం తీసివేస్తానని చెప్పిన కేసీఆర్ ఇంకా కొనసాగిస్తున్నారని, చివరికి టీఎస్ పీఎస్సీని కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులను బిజీ గా ఉంచాలనే నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు.

టీఎస్ పీఎస్సీలో 6 పరీక్షలు లీక్ అయ్యాయని, 30 లక్షల మంది నిరుద్యోగుల్లో బాధ గుండెల్లో నిండిపోయిందన్నారు. ఆందోళన చేస్తే ఉస్మానియా విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పోలీసులతో రాజ్యం నడపలేరని, తెలంగాణ సమాజం నీ మెడలు వంచి భరతం పడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో నిజాయితీకి, ధర్మానికి చోటు లేదన్నారు. సీఎం, కేటీఆర్ మీకు సంబంధం లేదు అని ఎలా చెప్తున్నారని ఈటల ప్రశ్నించారు. నయీం సిట్, ఎమ్మెల్యేల సిట్, డ్రగ్స్ కేసు.. ఈ కేసులన్నీ ఏమయ్యాయో ప్రజలందరికీ తెలుసునని, నీ చెప్పు చేతుల్లో ఉండే సిట్ ల మీద విశ్వాసం లేదన్నారు. టీఎస్ పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ లిక్కర్ స్కాంలో కూతురుని కాపాడుకొనే పనిలో ఉన్నారు తప్ప నిరుద్యోగుల ఆర్తనాదాలు పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగుల్లారా ఆత్యహత్యలు చేసుకోవద్దని, మేము అండగా ఉంటాము అని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.

బీజేపీ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఉందన్నారు. క్రిమినల్ పనులు, ఇల్లీగల్ దందాలు చేసేది కేసీఆర్ అని, ఇది ఆయన నిజస్వరూపం అని ఆమె విమర్శించారు. 3 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఇంద్రసేనా రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, డీకే అరుణ, ప్రభాకర్, సుభాష్, విశ్వేశ్వర్ రెడ్డితో పాటు నగరంలోని పలువురు బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


Next Story

Most Viewed