చార్మినార్‌లో కనువిందు చేస్తున్న పావురాల బ్రిడ్జి

by Dishanational1 |
చార్మినార్‌లో కనువిందు చేస్తున్న పావురాల బ్రిడ్జి
X

దిశ, చార్మినార్: మతసామరస్యానికి ప్రతీక అయిన భాగ్యనగరం ... శాంతికి చిహ్నం అయిన పావురాలకు పాతబస్తీ ముస్లిం జంఘ్ బ్రిడ్జి కేరాఫ్​అడ్రస్​గా మారింది. రంగురంగుల వేలాది కపోతాలతో ముస్లిం జంఘ్​బ్రిడ్జి కనువిందు చేస్తుంది. ఒకేసారి వేలాది పావురాలు చేసే గుటర్​గూ... గుటర్​గూ శబ్దాలతో మస్లిం జంఘ్​బ్రిడ్జి పరీవాహక ప్రాంతం విన సొంపుగా మారింది. దినదినాంతరం ఆ బ్రిడ్జి కాస్త పావురాల పార్క్​గా రూపాంతరం చెందుతుంది. నోరు లేని పక్షులకు అక్కడ చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా కుల, మత వర్గ విభేదాలు లేకుండా దాన .. ఆహారాన్ని వేస్తుండడం విశేషం. మరికొంత మంది దాతలు పక్కనే ఉన్న గోషాల వద్ద పప్పుధాన్యాల సంచులను నిలువ ఉంచుతారు. రోజుకు మూడు సార్లు సంచులను విప్పి ఆ పావురాలకు దానగా వేస్తుంటారు. మరికొంత మంది పావురాలకు దాన వేస్తే వ్యాపారాభివృద్ధి బాగుంటదనే సెంటిమెంట్​తో అక్కడికి వచ్చి తన శక్తి కొలది కపోతాలకు ఆహారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా జొన్నలు, ఎర్రపప్పు, కందిపప్పు, చెనిగెపప్పు, పుట్నాల పప్పు, నూకలను కొనుగోలు చేసి దానగా పావురాలకు వేస్తున్నారు. పక్షి ప్రేమికులు పావురాలకు అడ్డాగా మారిన పాతబస్తీలోని మస్లిం జంఘ్​బ్రిడ్జి, దారుల్​షిఫా ప్రాంతాలలో దాన వేస్తుండడం కనిపిస్తుంది.


100 సంవత్సరాల క్రితం నాటి ముస్లిం జంఘ్ బ్రిడ్జి ....

నవాబ్ ముస్లిం జంఘ్​బహదూర్ దాదాపు 100 ఏళ్ల క్రితం తన సొంత డబ్బులతో పాతబస్తీ నుంచి నగరానికి వెళ్లే వీలుగా మూసీనదిపై ఈ ముస్లింగ్ జంఘ్​బ్రిడ్జి నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్​రాజశేఖర్​రెడ్డి హయాంలో దానికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మించారు.

26 మైళ్ల దూరంలో ఉన్న వాటిని గుర్తించే పావురాలు ...

పావురం ఒక రకమైన పక్షిగా పిలుస్తారు. ఇందులో కొలంబీడ్​కుటుంబానికి చెందిన 300 జాతుల వరకు ఉన్నాయి. అందులో పెద్దగా ఉండే జాతులను కపోతాలు అని, చిన్నగా ఉండే జాతులను పావురాలుగా సంభోదిస్తారు. పూర్తిగా ఎదిగిన కపోతం ఒంటిమీద దాదాపు పదివేల ఈకలుంటాయి. పావురాలు దాదాపు 26 మైళ్ల దూరంలో ఉన్నవాటిని కూడా గుర్తిస్తాయి. అందుకే యుద్ధాల్లో శత్రు సైన్యాలను గుర్తించేందుకు పావురాలను ఉపయోగించేవారు. అంతేకాదు, వీటికి ఏకాగ్రత ఎక్కువ. ఎలాంటి దారిలోనయినా కన్‌ఫ్యూజ్ అవకుండా వెళ్లిపోగలవు. అందుకే అప్పట్లో సందేశాలను వీటితో పంపించేవారు. వీటి గుండె నిమిషానికి ఆరు వందలసార్లు కొట్టుకుంటుంది. ఇవి సెకనుకు పదిసార్లకు పైగా రెక్కలు ఆడిస్తాయి. పదహారు గంటలపాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగరగలుగుతాయి. తలను పైకి ఎత్తకుండా మింగే శక్తి ఉన్న పక్షి పావురం మాత్రమే. ఇతర పక్షులన్నీ నీటినిగానీ, ఆహారాన్నిగానీ నోటిలోకి తీసుకున్న తర్వాత తలను పైకెత్తి మింగుతాయి. పావురాలు జీవితంలో ఒక్కదానితోనే జతకడతాయి. చాలా పావురాలు తమ జంట పావురం చనిపోతే మరో దానికి దగ్గర కాకుండా అలాగే ఉండిపోతాయని పరిశోధనల్లో తేలింది.



Next Story

Most Viewed