ఆమె నాటకాలు ఆపాలి... నేను నాటకాలు ఆడలేదు

by Dishanational1 |
ఆమె నాటకాలు ఆపాలి...  నేను నాటకాలు ఆడలేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న పేపర్‌ లీక్స్, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై టీ - సేవ్ పేరుతో ఫోరం ఏర్పాటు చేసి అందులో ప్రతిపక్షాలు భాగస్వామ్యం కావాలని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల సీపీఎం, సీపీఐ, టీజేఎస్ పార్టీలతో భేటీ అయ్యారు. పేపర్ లీకేజీపై అందరు ఏకం అవ్వాలని వారితో షర్మిల చర్చించారు. ఈ క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల సోదరి ఆ గౌరవం నిలుపుకోవడం లేదన్నారు. తాము చాటుగా బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వలేదని తెలిపారు. తాము ఎవరికి బీటీం అని తమ ఆఫీస్ కి వచ్చి మాట్లాడే సాహసం చేసింది.. షర్మిల రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలంటే తాము స్వాగతిస్తామన్నారు. కానీ బీజేపీ‌నీ విమర్శించాలి అంటే ఆమెకి నోరు రాదని, రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తాము సమావేశాలు నిర్వహించినప్పుడు ఎప్పుడు ఆమె కలిసి రాలేదని, అందుకే ఇలాంటి నాటకాలు ఆమె ఆపాలని తమ్మినేని విమర్శించారు. బీజేపీతో కలిసి పనిచేయడం అనేది జరగదని స్పష్టం చేశారు. షర్మిలకు మద్దతుతో పోరాటంపై తమ నిర్ణయాలు త్వరలోనే తెలుపుతామని స్పష్టంచేశారు.

తమ్మినేనితో భేటీ అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, తొమ్మిదేళ్ళలో నిరుద్యోగం అనే భయంకరమైన వ్యాధి తెలంగాణకు వచ్చిందన్నారు. అందుకే టీ-సేవ్ తో అన్ని పార్టీలు ఏకం అయ్యి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. తమ్మినేని తనపై కొన్ని వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఏ ఒక్క సమావేశానికి రమ్మని ఎవరు కూడా ఫోన్ చేయలేదని అన్నారు. ‘‘కానీ నేను మీ పార్టీ ఆఫీస్ కి వచ్చాను.. నేను నాటకాలు అడుతున్నానని తమ్మినేని అన్నారు.. నేను నాటకాలు ఆడలేదు’’ అని షర్మిల అక్కడే ఉన్న తమ్మినేనితో అన్నారు. మునుగోడులో బీఆర్ఎస్ కి బీ టీంగా వామపక్షాలు పని చేశాయని నిలదీశారు. రాజకీయాలు అందరూ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం వైఎస్ షర్మిల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభశివరావుతో భేటీ అయ్యారు. షర్మిలది మంచి నిర్ణయమేనని కూనంనేని అన్నారు. కానీ బీజేపీ పాలనలో కూడా నిరుద్యోగం పెరిగిందని కూనంనేని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కమ్యూనిస్టులను గౌరవించేవారని తెలిపారు. షర్మిలతో జాయిన్ అవ్వాలననేది పార్టీలో చర్చించి తర్వాత చెబుతామని స్పష్టం చేశారు.

టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంతో షర్మిల భేటీ

టీ- సేవ్ ఫోరంపై కోదండరాంతో చర్చించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల పక్షాన కొట్లాడటమే టీ- సేవ్ లక్ష్యమన్నారు. ఇందులో అన్ని పార్టీలు ఏకం అవ్వాలని స్పష్టంచేశారు. ఎవరికి వారు పోరాటం చేస్తే సీఎం కేసీఆర్ అణిచి వేస్తున్నాడని, అన్ని పార్టీలు ఓకే వేదిక మీదకు వస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే, టీ- సేవ్ ఫోరం అధ్యక్షుడుగా ఉండాలని కోదండరాంను కోరామని తెలిపింది. కోదండరాం సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. టీ-సేవ్‌లో భాగస్వామ్యం కావాలని షర్మిల అడిగారని, నిరుద్యోగుల పక్షాన కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. షర్మిల ప్రతిపాదనలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed