‘చెత్త’ కిరికిరి.. చిచ్చుపెడుతున్న ఎస్ఎఫ్ఏల ధన దాహం!

by Disha Web Desk 9 |
‘చెత్త’ కిరికిరి.. చిచ్చుపెడుతున్న ఎస్ఎఫ్ఏల ధన దాహం!
X

దిశ, సిటీబ్యూరో: మహానగరంలోని స్వచ్చ ఆటో టిప్పర్ల మధ్య చెత్తను సేకరించే ఇళ్ల సంఖ్యకు సంబంధించి కిరికిరి కొనసాగుతుంది. ఇప్పటి వరకు వివిధ దశలుగా జీహెచ్ఎంసీ సుమారు 3250 స్వచ్చ ఆటో టిప్పర్లను సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఒక్కో ఆటోపై ఓ డ్రైవర్, మరో సహాయకుడు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్దంగా మెడికల్ ఆఫీసర్లు, ఎస్ఎఫ్ఏలు వారికి మరో సహాయకుడ్ని నియమించి చెత్తను సేకరిస్తున్న ఇళ్ల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

స్వచ్చ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టిన కొత్తలో నగరంలోని సుమారు 22 లక్షల ఇళ్లను ఒక్కో స్వచ్చ ఆటో టిప్పర్‌కు సుమారు 600 ఇళ్ల చొప్పున కేటాయించారు. కానీ ప్రతిరోజు దాదాపు 600 ఇళ్ల నుంచి కార్మికులు చెత్తను సేకరించలేకపోతున్నట్లు సమాచారం. చెత్తను సేకరించే ప్రతి ఇంటి నుంచి నెలసరి ఛార్జీలు వసూలు చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేయటంతో ఛార్జీలు ఇస్తున్న వారి ఇళ్ల నుంచి మాత్రమే కార్మికులు చెత్తను సేకరించేవారు. ఈ సిస్టమ్ అమలు చేసిన కొత్తలో నెలసరి చెత్త సేకరణ చార్జీలు ఇచ్చేందుకు విద్యావంతులు, అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న వారు నిరాకరించారు. దీంతో కార్మికులు చెత్త సేకరణను నిలిపివేయటంతో నామమాత్రపు ఛార్జీలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

ఇలా ఒక్కో ఆటోకు కేటాయించిన 600 ఇళ్ల నుంచి ప్రతిరోజు చెత్త సేకరించలేకపోవటంతో కనీసం రెండు రోజులకోసారైనా సేకరిస్తున్నారు. ఎలాగైనా నెలకు 600 ఇళ్ల నుంచి కనీసం వంద రూపాయలు వసూలు చేసుకున్నా, రూ.60 వేల ఆదాయం వస్తుందన్న ఆశతో ఎస్ఎఫ్ఏ, మెడికల్ ఆఫీసర్ వద్ద పైరవీ చేసుకుని అదనంగా మరో సహాయకుడిని నియమించుకుంటున్నారు. ఈ సిస్టమ్ దాదాపు నగరంలోని 30 సర్కిళ్లలో అనధికారికంగా అమలుకావటంతో కార్మికుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నయని సమాచారం. గతంలో ఇదే తరహాలో సంతోష్ నగర్‌లో చెత్తను సేకరించే ఇళ్ల సంఖ్యపై తీవ్రస్థాయిలో గొడవలు జరిగిన ఘటన తెలిసిందే. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటంతో కేసులు కూడా నమోదయ్యాయి.

నెలకు రూ.5 వేలు చెల్లించాల్సిందే..

ఇళ్ల నుంచి చెత్తను సేకరించే ప్రతి స్వచ్చ ఆటో టిప్పర్ ఎస్ఎఫ్ఏ, మెడికల్ ఆఫీసర్‌కు కలిపి ఒక్కోక్కరు నెలకు రూ.5 వేలు చెల్లించాల్సిందేనన్న నిబంధన అమలవుతుంది. తీరా ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు వెళ్లి చెత్త డంప్ చేసేందుకు అక్కడున్న సిబ్బందికి నెలకు రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తుందని పలువురు స్వచ్చ ఆటో టిప్పర్ కార్మికులు వాపోతున్నారు. రూల్స్ ప్రకారం ఇళ్ల నుంచి సేకరించాల్సిన చెత్తను స్వచ్చ ఆటో టిప్పర్లు స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు మాత్రమే తరలించాలన్న నిబంధన ఉన్నా, చాలా సర్కిళ్లలో మెడికల్ ఆఫీసర్లు ఈ కార్మికులను బయపెట్టి చెత్తను ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు కాకుండా శివారులోని జవహర్ నగర్‌లోని డంపింగ్ యార్డుకు తరలించాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

లష్కర్‌లో రిచ్ కార్మికులు..

తెల్లవారుజాము నుంచి చెత్తను సేకరించి, మధ్యాహ్నం రెండు గంటలకల్లా చెత్తను ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత హీరోల్లాగ తయారై దర్శనమిచ్చే రిచ్ కార్మికులు సికింద్రాబాద్ జోన్‌లో దర్శనమిస్తుంటారు. ఓ స్వచ్చ టిప్పర్ కార్మికుడు మధ్యాహ్నం తన విధులు ముగిసిన తర్వాత మెడలో బంగారు గొలుసులు, చేతి వేళ్లకు ఉంగరాలు ధరించి దర్జాగా విహారిస్తూ దర్శనమిస్తుంటాడు. నిర్వహించేది చెత్త విధులేనని, అందరూ అతడిని చూసి ఆశ్చర్యపోతుంటారు. కానీ ఆ కార్మికుడు ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను తన ఇంటి వద్ద సెగ్రిగేషన్ చేసి, అందులో ప్లాస్టిక్, అల్యూమీనియం, ఐరన్ వంటివి వేర్వేరుగా చేసి విక్రయించుకుంటున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed