అభ్యర్థులు, నేతల కదలికలపై సీక్రెట్ నిఘా

by Disha Web Desk 12 |
అభ్యర్థులు, నేతల కదలికలపై సీక్రెట్ నిఘా
X

దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1900 సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లలో పోలింగ్ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిపించే విషయంపై ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ సారి పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉండటంతో ఎన్నికల సంఘం పోలీసులు, నిఘా విభాగాలతో సమాచారం సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చినా ఎన్నికల సంఘం ఈ పోలింగ్ స్టేషన్ల వద్ద అవసరమైన బలగాల ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో నిమగ్నమైనట్లు సమాచారం.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో కొన్నింటిలో బూత్ క్యాప్చర్, రిగ్గింగ్, ముసుగులు వేసుకుని దొంగ ఓట్లు వేయడం, అభ్యర్థుల మధ్య ఘర్షణ పూరితమైన వాతావరణం నెలకొనడం వంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ సారి కాస్త ముందు నుంచే ఎన్నికల సంఘం ఈ ప్రాంతాలపై రహస్యంగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఆ ఘటనలకు పాల్పడిన వారు ఇపుడు అక్కడే స్థానికంగా ఉంటున్నారా? ఉంటే ప్రస్తుతం వారేం చేస్తున్నారు? వారి కదలికలేమిటీ? అన్న కోణంలో సమాచారం సేకరించేందుకు వీలుగా ఇంటెలిజెన్స్, ఎస్ బీ నిఘా సంస్థలు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాంతంలోని సామాన్య ప్రజలకు, ఓటర్లకు పోలింగ్ కు సహకరించేలా అవగాహన కల్పిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారు మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతూ వారి కదలికలపై ఏమాత్రం అనుమానం వచ్చినా, వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వీటిలో కొన్నింటిని జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ ఆఫీసర్లు పరిశీలించినట్లు సమాచారం.

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద ఆంక్షలు

సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ల చుట్టూ దాదాపు వంద మీటర్ల రేడియస్ లో ఆంక్షల అమలుతో పాటు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. నిఘా సంస్థలిచ్చే సమాచారం ప్రకారం ఎలక్షన్ కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి, పోలీసులు, ప్రత్యేక బలగాల యాక్షన్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారాన్ని బట్టి కేంద్ర ఎన్నికల వ్యయ, సాధారణ పరిశీలకులు పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా భారత ఎన్నికల సంఘానికి సిఫార్సులు చేయనున్నట్లు తెలిసింది.

అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ఎవరు?

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 30న జరిగిన పోలింగ్ రోజున సమస్యాత్మకమైన, అతి సమస్యాత్మకమైన 1900 పోలింగ్ స్టేషన్లలో వివిధ పార్టీల నుంచి పోలింగ్ ఏజెంట్లుగా విధులు నిర్వర్తించిన వారే, మళ్లీ ఏజెంట్లుగా వస్తారా? అన్న కోణంలో కూడా నిఘా విభాగాలు సమాచార సేకరణలో ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు అభ్యర్థులు ఎవరెవరు, ఏ పార్టీ నుంచి బరిలో నిలవనున్నారన్న సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్లు తెలిసింది. వివిధ పార్టీలు ఇప్పటికే కొందరు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినప్పటికీ, వారికి బీఫామ్ చేతికందితే తప్ప వారి అభ్యర్థిత్వం ఖరారు కాని పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లుగా వచ్చిన వారే, మళ్లీ ఏజెంట్లుగా వచ్చే అవకాశముంటే వారి కదలికలపై ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

అభ్యర్థులు పేర్లు సమర్పించగానే ఏజెంట్ల పూర్తి వివరాలను సేకరించాలని ఇప్పటికే నిఘా సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పోలింగ్ ఏజెంట్లు గా వ్యవహరించే వారు ఏమైనా నేర చరిత్ర కలిగి ఉన్నారా? పోలింగ్ బూత్ లో వారి ప్రవర్తన ఎలా ఉండబోతుందన్న కోణాల్లో సమాచారాన్ని సేకరించనున్నట్లు సమాచారం. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ఏజెంట్లు రాకపోకలు, అభ్యర్థుల సందర్శన వంటి అంశాలపై ఎన్నికల సంఘం పలు కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థుల సందర్శన పరిమిత సంఖ్యలో ఉండేలా ఆంక్షలు విధించనున్నట్లు తెలిసింది.


Next Story