ఎల్బీనగర్ వైపు రేవంత్ రెడ్డి చూపు...?

by Disha Web Desk 20 |
ఎల్బీనగర్ వైపు రేవంత్ రెడ్డి చూపు...?
X

దిశ, ఎల్బీనగర్ : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక రాష్ట్రంలో హస్తం పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. కాగా మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి తన పరిధిలోని ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే రాబోయే ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించడం వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేసినా.. ఎల్బీనగర్ అసెంబ్లీ బరిలో దిగి ప్రధాన దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

"దర్టీ డజన్" ఎమ్మెల్యేల ఓటమే అస్త్రంగా..!

గత అసెంబ్లీ ఎన్నికలలో హస్తం గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి "దర్టీ డజన్" అనే నామకరణం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ దర్టీ డజన్ ఎమ్మెల్యేలను ఓడించడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానంటూ ఇటీవల ఓ సభలో శపథం కూడా చేశారు. ఈ 12 మంది ఎమ్మెల్యేలలో కీలకమైన మంత్రి పదవిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డిపై, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా తన పార్లమెంట్ పరిధిలోని ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. దీంతో "ఒక్క దెబ్బకు - రెండు పిట్టలు" అని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

ఎల్బీనగర్ లో రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో ఆ ప్రభావం మహేశ్వరం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాలపై పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఔటర్ రింగ్ రోడ్డు కుంభకోణం, ఓ బడా బిల్డర్ ను బినామీగా పెట్టుకుని కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడం, రెడ్డి సామాజిక ఓటు బ్యాంకుతో పాటు గతంలో రేవంత్ రెడ్డి టీడీపీ నాయకునిగా ఉండడంతో ఎల్బీనగర్ లో ఉన్న టీడీపీ, ఆంధ్ర ఓటు బ్యాంక్ కలిసొచ్చే అంశాలుగా హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

వ్యూహాత్మక ఎత్తుగడ..!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వం పై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని కొడంగల్ తో పాటు మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపాలని హస్తం పార్టీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం చివరి నిమిషం వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.



Next Story

Most Viewed