భారతీయ సంస్కృతిని పరిరక్షించండి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 11 |
భారతీయ సంస్కృతిని పరిరక్షించండి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, అంబర్ పేట్: భారతీయ సంస్కృతిని రాబోయే తరాలకు తెలియజేసి పరిరక్షించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ భాష సంస్కృతి శాఖ సౌజన్యంతో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'సుస్వర రాగోత్సవం' 2023 ముగింపు సభ రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కళలకు పూర్వ వైభవం తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. సాహిత్య కళలను పాఠశాల విద్యార్థులకు పరిచయం చేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో కళ, సాహిత్య రంగాలలో రాష్ట్రం గర్వించే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ సాహిత్య, సంగీత నాటక అకాడమీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో మృగంగా మారుతున్న మానవుడిని మనిషిగా మార్చే శక్తి కేవలం కళలకు ఉందన్నారు. ఉదయరాగం పేరిట అత్యంత ప్రతిభవంతులచే కచేరీలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నాటక అకాడమీ చైర్మన్ దీపికా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ సూచనల మేరకు సుస్వార రాగోత్సవం పేరుతో మూడు రోజుల పాటు 'జాతీయ అంతర్జాతీయ' స్థాయిలో పేరొందిన సంగీతం విద్వాంసులచే గాత్ర, వాద్య కచేరిలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ వీణ విద్వాంసురాలు ఈమని లలితా కృష్ణ, గాత్ర సంగీత విద్వాంసులు డీఎస్ వీ శాస్త్రి, గిటార్ వాయిద్య కళాకారుడు జైవంత్ నాయుడు, హిందూస్తానీ సంగీత విద్వాంసులు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



Next Story