జీహెచ్ఎంసీలో ఔట్‌సోర్సే మెయిన్ సోర్స్‌

by Mahesh |
జీహెచ్ఎంసీలో ఔట్‌సోర్సే మెయిన్ సోర్స్‌
X

దిశ, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ సిటీలోని సుమారు కోటిన్నర మంది జనాభాకు అత్యవసరమైన సేవలందించే జీహెచ్ఎంసీలో రోజురోజుకు సిబ్బంది తగ్గుతూ.. ఇబ్బందులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర పాలక సంస్థ ఏర్పడినప్పుడు మంజూరు చేసిన మొత్తం పోస్టులు సుమారు ఆరువేల పైచిలుకు కాగా, వీటిలో ప్రతి నెల ఉద్యోగులు రిటైర్డ్ అవుతూ పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య మూడున్నర వేలకు తగ్గింది. తగ్గిన సిబ్బందిలోనూ దాదాపు యాభై శాతం కన్నా ఎక్కువ మంది పర్మినెంట్ ఉద్యోగులు డ్యూటీలు చేయడం లేదు. దాదాపు వెయ్యి నుంచి 1200 మంది వివిధ యూనియన్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది ఉదయాన్నే అటెండెన్స్ వేసుకుని, యూనియన్ కార్యకలాపాలపై తిరుగుతుండగా, మరికొందరు కనీసం సంతకం కూడా పెట్టుకుండానే నెలసరి జీతాలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీనికి తోడు ఒక్క శానిటేషన్ విభాగంలోనే 18 వేల పైచిలుకు కార్మికులుండగా, పర్మినెంట్, ఔట్‌సోర్స్, కాంట్రాక్టు కార్మికులందరితో కలుపుకుని దాదాపు 30 వేల మంది వివిధ రకాల విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఉన్న వారిపై పనిభారం..

విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగుల స్థానంలో వారి వారసులకు కారుణ్య నియామకాలు జరుపుతున్నారే తప్ప, ఖాళీ అవుతున్న స్థానంలో కొత్త వారిని నియమించటం లేదు. అవసరాలకు తగిన విధంగా ఔట్‌సోర్స్ ఉద్యోగులను నియమించుకుని జీహెచ్ఎంసీ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తుంది. ఉద్యోగులు సంఖ్య తగ్గుతుండటంతో విధి నిర్వహణలో ఉన్న వారిపై పనిభారం పెరుగుతూ వస్తుంది. జీహెచ్ఎంసీలో శానిటేషన్, హెల్త్, ఎంటమాలజీ, వెటర్నరీ, లీగల్, పరిపాలన, అర్బన్ డైవర్సిటీ, టౌన్ ప్లానింగ్, ప్రాజెక్టులు, మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేందుకు తగిన సంఖ్యలో ఉద్యోగులు లేరు. అక్రమ నిర్మాణాలను ప్రాథమిక దశలో గుర్తించేందుకు, గుర్తించిన వాటిని నేలమట్టం చేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగంలో అవసరమైన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఆశించిన స్థాయిలో విధులు నిర్వర్తించలేకపోతున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల అధిపతులు తమ విభాగానికి వంద నుంచి రెండు వందల మంది అదనపు సిబ్బందిని కేటాయించాలని కోరుతూ అడ్మిన్ సెక్షన్‌కు ప్రతిపాదనలు పంపుతున్నట్లు సమాచారం. ఈ రకంగా వచ్చిన ప్రతిపాదనలన్నింటిని జీహెచ్ఎంసీ అడ్మిన్ సెక్షన్ సర్కారుకు పంపి, సర్కారు అనుమతించిన తరువాత సిబ్బందిని సమకూర్చాలని భావిస్తున్నట్లు తెలిసింది.

కీలకంగా మారిన ఔట్‌సోర్స్..

హైదారబాద్ మహానగరానికి గుండెకాయ లాంటి జీహెచ్ఎంసీలో ఔట్‌సోర్స్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్స్ కార్మికులే కీలకంగా మారారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, జీహెచ్ఎంసీని పేపర్ లెస్ ఆఫీసు గా మార్చేందుకు అమలు చేసిన ఈ ఆఫీసు వంటి ప్రక్రియల్లో ఔట్‌సోర్స్ ఎంప్లాయీసే అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఔట్‌సోర్స్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల సేవలు మరీ ముఖ్యమైనవి. చాలా మంది ఔట్‌సోర్స్ ఉద్యోగులు పర్మినెంట్ ఉద్యోగులైన సూపరింటెండెంట్, ఆఫీసు మేనేజర్, అసిస్టెంట్ మున్సిపల్ కార్మికుల కన్నా చక్కటి పని నైపుణ్యతతో సేవలందిస్తున్నారు. కొన్ని విభాగాలైతే ఔట్‌సోర్స్ ఉద్యోగులు లేకుంటే అంతే సంగతి. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లోని ఈ ఆఫీసును ఎక్కువ శాతం ఔట్‌సోర్స్ ఉద్యోగులే నిర్వహిస్తున్నారు.

రిటైర్‌మెంట్‌కు దగ్గర్లో ఉన్న పలువురు సూపరింటెండెంట్లు, ఆఫీసు మేనేజర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ హోదాల్లో ఉన్న ఉద్యోగుల యూజర్ ఐడీ, పాస్ వార్డ్‌లు సైతం ఔట్‌సోర్స్ ఉద్యోగులే మెయింటెన్ చేస్తున్నారు. పీజీలు చేసిన కొందరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేసే ఔట్‌సోర్స్ కార్మికులు కొందరు ఎనిమిది గంటల పని రూల్ వర్తించకుండా పది నుంచి పన్నెండు గంటల పాటు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పర్మినెంట్, ఔట్‌సోర్స్ ఉద్యోగుల జీతాల బిల్లుల, సర్వీస్ సంబంధిత ఫైళ్ల రన్, ప్రాజెక్టు విభాగంలోని బిల్లులు, ఐటీలోని ముఖ్యమైన సేవలను కూడా ఈ ఔట్‌సోర్స్ ఉద్యోగులే నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీలో రోజురోజుకు పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటంతో ఔట్‌సోర్సే మెయిన్ సోర్స్‌గా మారుతుంది.

Advertisement

Next Story