బీజేపీకి చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి..

by Disha Web Desk 20 |
బీజేపీకి చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి..
X

దిశ, శేరిలింగంపల్లి : విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీకి రాష్ట్రంలో, దేశంలో కాలం చెల్లిందని వారి మాటలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితులు లేవని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ అన్నారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాంధీ మాట్లాడుతూ బీజేపీ నాయకుల తీరును తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో గత నెలరోజులుగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ కొందరు స్వార్ధ పరులు వరుసగా పేపర్ లీకేజీలు చేస్తున్నారని, వారికి ఎవరితో సంబంధం ఉంది అనేది త్వరలోనే పూర్తిగా బయటపడుతుందని అన్నారు.

నీరు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ కల్పన చేపట్టామన్నారు. కానీ పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారని అన్నారు. యువతను ఇబ్బంది పెట్టే ధోరణితో బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే గాంధీ. యువత భవిష్యత్తును నాశనం చేసేలా బండి సంజయ్ కుట్రలు చేస్తున్నారని, స్వార్ధ రాజకీయాలు కోసం బీజేపీ చేస్తున్న కుట్రలను యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుందని అన్నారు. పేపర్ లీకేజీ ఘటనలో మొట్టమొదటి కాల్ వెళ్ళింది బండి సంజయ్ కేనని, ఆయన మాట్లాడింది కూడా త్వరలోనే బయటకు వస్తాయని, అవన్నీ కోర్టులో సబ్మిట్ చేస్తున్నారని తెలిపారు. దొంగలే దొంగా దొంగా అనేలా వ్యవహరిస్తున్నారని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేస్తున్నారని అన్నారు గాంధీ.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజీపీ ధరలు పెంచారని, నిత్యావసర సరుకుల ధరలు పెంచారని, చివరకు సబ్సిడీలు కూడా ఎత్తేయాలని మోడీ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ అని, పేద, బడుగు, బలహీన వర్గాల బాధలు తెలిసిన వాడు కాబట్టే తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఊకదంపుడు ఉపన్యాసాలు కాకుండా దేశ, దశ, దిశ మార్చే ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తున్నామని, సొంత నిధులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించి దేశంలో టాప్ 5 వరిధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.

కేంద్రమే అవార్డులు, ప్రశంసలు అందిస్తూ.. మరోపక్క విమర్శలు గుప్పించడం సిగ్గుచేటని అన్నారు. సుపరిపాలనను ఓర్వలేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్రంతో పోటీ పడాల్సిన కేంద్రం ఈర్షపడుతుందని అన్నారు. అభివృద్ధిలో పోటీపడాలి కానీ లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు గాంధీ. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, రోజాదేవీ రంగారావు, నార్నే శ్రీనివాస్ రావు, సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed